పాక్‌ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీ | Pakistan Names Shahid Khaqan Abbasi Interim Prime Minister | Sakshi
Sakshi News home page

పాక్‌ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీ

Published Sun, Jul 30 2017 1:10 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

పాక్‌ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీ - Sakshi

పాక్‌ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీ

షహబాజ్‌ షరీఫ్‌ పార్లమెంటుకు ఎన్నికయ్యే వరకే...
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ తాత్కాలిక ప్రధాన మంత్రిగా పీఎంఎల్‌–ఎన్‌ (పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌) సీనియర్‌ నేత, మాజీ పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్‌ ఖక్కన్‌ అబ్బాసీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తమ్ముడు షహబాజ్‌ షరీఫ్‌ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలో శనివారం సమావేశమైన పీఎంఎల్‌–ఎన్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి నవాజ్‌ షరీఫ్‌ ఎన్నికల సంఘానికి తప్పుడు వివరాలు సమర్పించారంటూ పాక్‌ సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించగా, ఆయన ప్రధాని పదవిని కోల్పోవడం తెలిసిందే.

షరీఫ్, ఆయన పిల్లలపై అవినీతి కేసులు నమోదు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. పాక్‌ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రధాని పదవి చేపట్టాలంటే ముందుగా కచ్చితంగా వారు జాతీయ అసెంబ్లీలో సభ్యులై ఉండాలి. అయితే ప్రస్తుతం పాక్‌లోని పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న షహబాజ్‌ పార్లమెంటు సభ్యుడు కాదు. ఈ నేపథ్యంలో షహబాజ్‌ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా షాహిద్‌ అబ్బాసీని నియమించాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. షహబాజ్‌ ఎన్నిక కాగానే అబ్బాసీ రాజీనామా చేస్తారు. దాదాపు 45 రోజులపాటు అబ్బాసీ పదవిలో ఉండే అవకాశం ఉంది. అలాగే నవాజ్‌ షరీఫ్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని కూడా పార్టీ సమావేశంలో నిర్ణయించారు.

షరీఫ్‌పై అనర్హత ఎంతకాలం?
నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత ఎంతకాలం ఉంటుంది? ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావటం సాధ్యమేనా? పాకిస్తాన్‌ న్యాయనిపుణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజల్లో ఈ ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. దీనిపై న్యాయ నిపుణులు కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. కొన్నేళ్ల వరకు దీనిపై ఓ స్పష్టత రాదని మరికొందరి అభిప్రాయం. ఇది శాశ్వత అనర్హతేనని పాక్‌ బార్‌ కౌన్సిల్‌ చెబుతుండగా.. తాత్కాలికమేనని మాజీ న్యాయమూర్తులంటున్నారు.

‘పార్లమెంటు సభ్యులు నిజాయితీపరులై ఉండాలని ఆర్టికల్‌ 62, 63 చెబుతున్నాయి. అయితే వ్యక్తుల్లో మార్పు వచ్చిన తర్వాత కూడా అనర్హత కొనసాగించటం సరికాదు’ అని ఇలాంటి కేసులను విచారించిన పాక్‌ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అన్వర్‌ జహీర్‌ పేర్కొన్నారు. ఈ ఆర్టికల్స్‌ ఆధారంగా శాశ్వత అనర్హత విధించటంపై, ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్చ జరగాలని ఆయన తెలిపారు. 62(1)(ఎఫ్‌) ప్రకారం ఎన్నేళ్ల అనర్హత అనే అంశంపై స్పష్టత లేదని.. అయితే 2012లో యూసుఫ్‌ రజా గిలానీపై ఆర్టికల్‌ 63 ప్రకారం ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసిన విషయాన్ని మరో న్యాయవాది గుర్తుచేశారు.   

అవినీతిపరులకు హెచ్చరిక:  మీడియా
నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటు వేయడం ద్వారా సుప్రీం కోర్టు అవినీతిపరులకు గట్టి హెచ్చరికలు పంపిందని పాక్‌ మీడియా పేర్కొంది. ప్రజాస్వామ్య విధానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నాయకులు శ్రమించాలని పిలుపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు పాక్‌లో రాజకీయ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందని ప్రముఖ ఇంగ్లిష్‌ దినపత్రిక డాన్‌ తన సంపాదకీయ వ్యాసంలో వ్యాఖ్యానించింది.

ముషార్రఫ్‌ హర్షం
నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటువేయడంపై పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ ప్రధానిని అనర్హుడిగా ప్రకటించినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. నవాజ్, ఆయన పిల్లలు దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందనీ, వారిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించాలని ముషార్రఫ్‌ అన్నారు.

ఇదీ ఆర్మీ కుట్రేనా?
► భారత్‌తో సత్సంబంధాలకు షరీఫ్‌ యత్నంపై వ్యతిరేకత
► న్యాయవ్యవస్థతో కలసి ప్రభుత్వంపై తిరుగుబాటు!


పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటుకు పాకిస్తాన్‌ మిలటరీ నాయకత్వం, ప్రజా ప్రభుత్వం మధ్య కొంతకాలంగా జరుగుతున్న అంతర్గత ఘర్షణే కారణమనే వాదన వినిపిస్తోంది. మిలటరీ, న్యాయవ్యవస్థలు సంయుక్తంగా పన్నిన కుట్రలో భాగంగానే తాజా తీర్పు వెలువడినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్న పాక్‌ను కాపాడేందుకు షరీఫ్‌ చేసిన ప్రయత్నమే పదవీచ్యుతున్ని చేసినట్లు సమాచారం.

పాక్‌ ఆర్మీ, ఇస్లామిక్‌ ఛాందసవాదులు షరీఫ్‌ను పావురం(శాంతిదూత)గా పిలుస్తారు. భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించుకోవటం, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుని పాక్‌ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇది నచ్చని మిలటరీ.. షరీఫ్‌ తమ అధికారాన్ని తగ్గిస్తున్నారని భావిస్తున్నట్లు డాన్‌  పత్రిక పేర్కొంది. అందుకే తిరిగి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కొంతకాలంగా ఆర్మీ ప్రయత్నిస్తోంది.  

చైనా కూడా ప్రశ్నిస్తోంది.. ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి భేటీలో ఉగ్రవాదులపై వివిధ ప్రావిన్సులు తీసుకునే చట్టపరమైన చర్యల్లో మిలటరీ ఆధీనంలో పనిచేసే ఐఎస్‌ఐ జోక్యం చేసుకోకూడదని షరీఫ్‌ కోరారు. దీంతోపాటుగా ముంబై దాడులు, పఠాన్‌కోట్‌ ఘటనలపై విచారణను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ముగించేయాలని సూచించారు. ఈ సమావేశంలో పాక్‌ విదేశాంగ కార్యదర్శి చౌదరీ ఓ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అమెరికా సూచించినట్లుగా హక్కానీ నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకోవటం, పఠాన్‌కోట్‌ విచారణను త్వరగా పూర్తిచేసి జైషే మహ్మద్‌పై చర్యలు తీసుకోవటం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు.

పాకిస్తాన్‌కు మద్దతును చైనా పునరుద్ఘాటిస్తున్నప్పటికీ.. పలు అంశాల్లో పాక్‌ తీరుమార్చుకోవాలంటూ సూచించటాన్నీ వెల్లడించారు. మసూద్‌పై యూఎన్‌ నిషేధాన్ని కారణం లేకుండా ఎంతకాలం వ్యతిరేకించాలని చైనా ప్రశ్నిస్తోందన్నారు. ఉగ్రవాదులపై చర్యల అంశంపై జనరల్‌ ఐఎస్‌ఐ డీజీ జనరల్‌ అక్తర్, ప్రభుత్వ అధికారుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. భారత ఒత్తిడికి తలొగ్గొద్దని అక్తర్‌ స్పష్టం చేశారు. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోకతప్పదని షరీఫ్‌ అన్నారు. దీంతో మిలటరీ, న్యాయ శాఖ కలసి  షరీఫ్‌ను గద్దెదించాలని పథకం పన్నినట్లు భావిస్తున్నారు.

మిలటరీ తిరుగుబాటు సాధారణమే!
పాక్‌ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆర్మీ యత్నిస్తుంటుంది. న్యాయవ్యవస్థా అందుకు సాయం చేస్తుంటుంది.  మాజీ ఆర్మీ చీఫ్‌ ముషార్రఫ్‌ గతంలో నవాజ్‌ షరీఫ్‌ను గద్దెదింపి 8 ఏళ్లపాటు పాక్‌లో మిలటరీ పాలన నడిపారు. పలు సందర్భాల్లో మిలటరీ అధికారికంగానే ప్రభుత్వాన్ని నడిపించింది. పనామా వివాదంలో షరీఫ్, ఆయన కుటుంబసభ్యులపై విచారణ కొనసాగుతోంది. దీనిపై తుది నివేదిక రాకముందే ఆర్మీ ఆదేశాలతోనే సుప్రీం కోర్టు షరీఫ్‌పై అనర్హత వేటు వేసింది.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement