యజమాని హంతకుడిని పట్టించిన చిలుక
ఆగ్రా: తన యజమాని భార్యను హత్యచేసిన దుండగుడిని ఒక పెంపుడు చిలుక పట్టించింది. తన యజమానులు నేర్పిన మాటలతోనే.. హంతకుడెవరో చెప్పేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఒక హిందీ వార్తాపత్రిక ఎడిటర్ విజయ్ శర్మ భార్య నీలంను ఫిబ్రవరి 20న ఎవరో దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కూడా. అయితే విజయ్ అల్లుడు అశుతోష్ గోస్వామి ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా.. విజయ్ పెంచుకుంటున్న చిలుక భయంగా అరుస్తూ, విచిత్రంగా ప్రవర్తించసాగింది. విజయ్ ఆ చిలుకకు అంతకుముందే మాటలు నేర్పి ఉండడంతో... అనుమానితుల పేర్లను దాని ముందు పలకడం ప్రారంభించారు. అందులో అశుతోష్ పేరును పలికినప్పుడు ఆ చిలుక... ‘ఉస్నే మారా.. ఉస్నే మారా (అతనే చంపాడు.. అతనే చంపాడు)’ అని అరవడం ప్రారంభించింది.
ఈ విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు అశుతోష్‌ను అదుపులోకి తీసుకుని.. తమదైన పద్ధతిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. రోన్నీ మాసే అనే వ్యక్తితో కలిసి అశుతోష్.. విజయ్ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. డబ్బు, విలువైన వస్తువులు ఇవ్వాలని నీలంను బెదిరించారు. ఒకవేళ తమ పేర్లు బయటికి చెబుతుందేమోనని కత్తితో పొడిచి చంపేశారు. నీలం పెంపుడు కుక్క అరవడంతో దానినీ చంపేశారు. ఈ దృశ్యాన్ని చూసిన చిలుక... బయటపెట్టడంతో దొరికిపోయారు.