పదిహేనేళ్ల క్రితం మేము మా ఫార్మ్ హౌస్ లోకి మారే సమయానికి అక్కడే ఉన్న ఒక తాటి చెట్టుని గమనించాము. అది తన పక్కనే ఉన్నపెద్ద మర్రి చెట్టుతో సూర్యరశ్మి కోసం పోటీ పడుతూండటం చూసాము. పగటి పూట ఒక నల్లంచి పక్షి ఆ తాటి ఆకుల మధ్య కట్టుకున్న తన గూటిలోకి వెళ్ళివస్తూ కనిపించేది. సాయంత్రం ఎండిన తాటి ఆకుల మధ్య విశ్రమించిన గబ్బిలాలు ఆహారం కోసం బయటకు వస్తూ కనిపించేవి.
తాటి కాయలు బాగా పండి, నలుపు రంగులోకి మారి మంచి వాసన వచ్చే సమయానికి పునుగు పిల్లులు వస్తుండేవి. అవి రాత్రి సమయాల్లో పండిన తాటి కాయలను తినడం కోసం చెట్లు ఎక్కి, ఎండిన తాటి ఆకులపైకి దూకుతూ శబ్దం చేసేవి. ఒకసారి తాటి కాయలను తిన్న తరువాత క్రింద పడేస్తుంటే, ఆ కాయలు నేలపై ఉండే ఎండుటాకులకు తగిలి రాత్రి నిశబ్దానికి భంగం కలిగించేవి. ఒక్కోసారి రెండు మూడు పునుగు పిల్లులు బిగ్గరగా అరుస్తూ పోట్లాడుకుంటుంటే ఆ శబ్దానికి నిద్రాభంగం అయిన నా భర్త రోమ్ నిద్రలేచి “నోర్మూసుకో” అని నా మీద అరిసి అటు తిరిగి చక్కగా గురకపెట్టేవాడు!
మంచి ఎండాకాలంలో రాత్రి వేళలో వీచే గాలి, ఆ తాటి చెట్ల ఆకులను కదిలిస్తూ భయపెట్టే శబ్దాన్ని చేసేది. కొంతమంది ఈ శబ్దాలు దెయ్యాలు చేసేవని భ్రమపడుతుండేవారు. ఉదాహరణకు ఎప్పుడైనా అర్ధరాత్రి వేళల్లో మమ్మల్ని ఇంటి వద్ద దించటానికి వచ్చే టాక్సీ డ్రైవర్లు ఆ పరిసరాలను గమనించి "ఇలాంటి చోట్ల ఉండటానికి మీకు భయంగా లేదా!" అని ఎవరికి వినపడనంత మెల్లగా మమ్మల్నిఅడిగేవారు!
కొన్నిదశాబ్దాల క్రితం కొన్ని తాటి చెట్లు వరుసగా మొలకెత్తి పెద్ద చెట్లు అయ్యాయి. కొన్నాళ్లకు ఒక మర్రి చెట్టు వాటిల్లోని ఒక తాటి చెట్టుపై మొలకెత్తి పరాన్నజీవిలా బ్రతకటం మొదలుపెట్టింది. తాటి చెట్లు ఎత్తుగా ఏపుగా పెరుగుతుంటే, వాటితో పాటు మర్రి చెట్టుకూడా తన కొమ్మలను వేర్లను విస్తరిస్తూ దారిలో అడ్డు ఉన్నవాటిని తినేసేడట్లు బలంగా ఎదగడం మొదలుపెట్టింది. కొన్నేళ్ళకు ఆ మర్రి చెట్టు ధాటికి దాదాపుగా అన్ని తాటి చెట్లు చనిపోగా ఒకే ఒక్క తాటి చెట్టు మిగిలింది!
కొన్నేళ్లకు ఆ మిగిలిన ఒక్క తాటి చెట్టు కూడా తన తల భాగం వంగిపోయేసరికి, పాపం ఈ చెట్టు కూడా మర్రి చెట్టుతో చేసిన పోరాటంలో ఓడిపోయింది అని మాకు అర్ధమయింది! ఆఖరికి దాని తల భాగం రాలిపోయి కేవలం కాండం మాత్రం ఒకప్పటి చెట్టుకి గుర్తుగా మిగిలిపోయింది.
ఇది జరిగిన కొద్ది నెలల్లోనే రెండు బంగారు వర్ణపు వడ్రంగి పిట్టలు చనిపోయిన తాటి చెట్టు మిగిలి ఉన్న కాండాన్ని గుర్తించి వాటిపై రంధ్రాలు చెయ్యడం మొదలుపెట్టాయి. చివరికి ఆ కాండం పైభాగాన ఒక రంధ్రం చేసి గూడు కట్టాయి. కొన్ని వారాలకు ఒక రోజు మాకు తొర్ర వద్ద తల్లితండ్రి తెచ్చే ఆహారం కోసం అసహనంతో ఎదురుచూస్తున్న రెండు వడ్రంగి పిట్టల పిల్లలు కనిపించాయి!
పిల్లలు పెద్దవై ఎగిరిపోయాక ఆ వడ్రంగి పిట్టల కుటుంబం ఆ తొర్రను ఖాళీ చేసి వెళ్ళిపోయి అప్పుడప్పుడు కనిపిస్తుండేవి. ఒక రెండేళ్లకు మరికొన్ని పక్షులు ఆ తొర్రలో ఆవాసం ఏర్పరుచుకున్నాయి. కొన్ని రామచిలుకలు ఆ గూటి యజమానులైన వండ్రంగి పిట్టలను తరిమేసి ఆ తొర్రను పెద్దది చేసి, దానిని నివాసానికి అనుగుణంగా చేసుకునే సమయానికి రెండు గుడ్లగూబలు వచ్చి చేరాయి. ఆ రామ చిలుకలు కొన్నిరోజులపాటు ఆ తొర్ర వద్ద ఎంత గోల చేసినప్పటికీ ఆ గుడ్లగూబలు తొణకకుండా, బెణకకుండా ఆ తొర్రను ఆక్రమించేశాయి.
చిలుకలు ఎంత కష్టపడ్డప్పటికీ ఆ గుడ్లగూబలను ఏమీ చేయలేకపోయాయి. ఆ గుడ్లగూబలు కాస్త సర్దుకునే సమయానికి ఒక నల్లంచి వచ్చి ఆ గుడ్లగూబలను ఎదో చేసి మొత్తానికి ఆ తొర్ర నుంచి తరిమేసింది. “హమ్మయ్య చివరికి ఒక పక్షి ఈ తొర్రను తన ఇల్లుగా చేసుకుంటుంది” అని మేము సంబరపడేలోపలే ఒక జత గోరింకలు వచ్చి ఆ నల్లంచిని తరిమేసి ఆ గూటిలో స్థిరపడిపోయాయి!
ఆ గోరింకలు కొన్నేళ్లపాటు ఆ తాటి చెట్టు తొర్రలో నివసించాయి. పక్షులే కాకుండా ఆ చనిపోయిన చెట్టు కాండం మీద కొన్నిరకాల బల్లులు, కాళ్ళ జెర్రెలు నివసించేవి. కానీ ఒక రోజు ఆ చెట్టు కాండం పడిపోవడంతో ఆ జీవులన్నీ గూడు లేనివి అయిపోయాయి! అయినప్పటికీ ఆ క్రింద పడిపోయిన కాండం మట్టిలో కలిసిపోయే లోపల కొన్ని కప్పలకు, నీటి పాములకు, పెంకు పురుగులకు, చెద పురుగులకు, బల్లి గుడ్లకు ఆశ్రయమిచ్చింది. ఇదంతా జరిగేలోపల మన మర్రి చెట్టు మా వంటింటి వ్యర్ధాల నీటి వలన బలపడి ఐదారు రెట్లు పెరిగి మహా వృక్షమైపోయింది!
--జానకి లెనిన్
కృష్ణమూర్తి(ఫోటోలు)
(చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!)
Comments
Please login to add a commentAdd a comment