విష సర్పంతో సరదా.. చావును చూపించింది!
వాషింగ్టన్: సర్పాలను పట్టేవ్యక్తి వాటితో చేసిన సరదా పనే అతడ్ని చావు అంచులకు తీసుకెళ్లింది. విషసర్పం అతడి ముఖంపై కాటేసినా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో జరిగిన ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. విక్టర్ ప్రాట్ అనే 40 ఏళ్ల వ్యక్తి అరిజోనాలోని ఫోనిక్స్ నగరంలో నివాసం ఉండేవాడు. కొన్ని రోజుల కిందట తన కుమారుడి పుట్టనిరోజు వేడకలకు తన సన్నిహితులను ఆహ్వానించాడు.
పాములను పట్టడమే కాదు వాటితో వంటకాలు చేయడం రిక్టర్‌కు అలవాటు. చిన్నతనం నుంచి పాములు పట్టడం, వాటితో ఆడుకోవడం తనకు అలవాటేనని స్నేహితులతో గొప్పలకుపోయాడు. తాను విషసర్పాలతో చిన్న పిల్లలతో ఆడతామో, నిద్రస్తామో అలాగే గడుపుతానని చెప్పాడు. ఆ తర్వాత ఓ విషసర్పాన్ని చేతిలో పట్టుకుని ఆటలు మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత ఆ పాము అకస్మాత్తుగా రిక్టర్ ముఖంపై కాటేయడంతో స్పృహకోల్పోయాడు. అతడ్ని స్థానిక బానర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొన్ని రోజులపాటు డాక్లర్లు చేసిన శ్రమ ఫలించి రిక్టర్ మామూలు మనిషయ్యాడు.
మరికొన్ని నిమిషాలు ఆలస్యమైతే రిక్టర్ కచ్చితంగా చనిపోయేవాడని టాక్సానమీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ స్టీవెన్ కర్రీ తెలిపారు. సాధారణంగా పాములు మనిషిని ఏదో భాగంలో కాటేస్తుంటాయి.. కానీ ముఖంపై కాటు అనేది చాలా అరుదుగా జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది ఎంతో మందికి చికిత్స ఇచ్చాం కానీ రిక్టర్ విషయంలో మాత్రం.. అతడు పాముతో ఆడుకుంటూ కాటుకు గురయ్యాడని వివరించారు.
గత సోమవారం పూర్తిగా కోలుకున్న అనంతరం రిక్టర్ పలు విషయాలను ప్రస్తావించాడు. నా కుమారులు త్వరగా ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాలతో ఉన్నాను. దయచేసి నాలాగా మీరు పాములు, ఇతర విష ప్రాణులతో ఆటలు ఆడవద్దు. ఇలాంటివి ప్రాణాల మీదకి తెస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందని.. అదృష్టవశాత్తూ నేను చావును చూసినా బతికొచ్చానని బాధితుడు రిక్టర్ ప్రాట్ వివరించాడు.