బెర్లిన్‌లో భౌతిక గోడైతే భారత్‌లో అదృశ్య గోడ | pm modi implementing invisible wall in india | Sakshi
Sakshi News home page

బెర్లిన్‌లో భౌతిక గోడైతే భారత్‌లో అదృశ్య గోడ

Published Tue, Nov 8 2016 6:35 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

బెర్లిన్‌లో భౌతిక గోడైతే భారత్‌లో అదృశ్య గోడ - Sakshi

బెర్లిన్‌లో భౌతిక గోడైతే భారత్‌లో అదృశ్య గోడ

న్యూఢిల్లీ : ఎన్డీటీవీ హిందీ ఛానల్‌ ప్రసారాలను బుధవారం ఒక రోజు నిలిపివేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను పునర్‌ సమీక్షిస్తామని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించడం కాస్త ఊరట కలిగించే అంశమే. రేపు బుధవారంకున్న ప్రాముఖ్యత ప్రభుత్వానికి తెలియకపోవచ్చుగానీ, మీడియా పీపుల్‌కు మాత్రం అది ముఖ్యమైన రోజు. బుధవారం నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఈ ఫలితాల ప్రభావం భారత్‌పైనా, మొత్తం ప్రపంచంపై ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను నిర్వహించడంతోపాటు వివిధ కోణాల నుంచి ఫలితాలను విశ్లేషించి, చర్చాగోష్ఠులను నిర్వహించడం రేపు ఏ టీవీ ఛానల్‌ మనుగడకైనా ముఖ్యమే. భారత్‌ మీడియాలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు విస్తత కవరేజ్‌ వచ్చినందున రేపు యాడ్స్, యాడ్స్‌ టారిప్‌లు ఛానళ్లకు పెరిగే అవకాశం కూడా ఉంది.

నవంబర్‌ 9వ తేదీ (1989)....మరో చరిత్రాత్మకమైన రోజు. తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య బెర్లిన్‌వాల్‌ను కూల్చేసిన రోజు. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీకి ప్రజలెవరూ వెళ్లకుండా నిర్మించినది బెర్లిన్‌ గోడ. గోడ కూల్చివేతకు ముందు అక్కడి సమాచార వ్యవస్థపై, ప్రభుత్వ వైఖరిని విమర్శించే వర్గాలపై ఎంతో అణచివేత, ఎన్నో ఆంక్షలు ఉండేవి. భారత్‌లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా గత 29 నెలలుగా అలాంటి గోడనే నిర్మిస్తోంది. బెర్లిన్‌ గోడ భౌతికమైనదైతే మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్నది అదృశ్య గోడ. అక్కడ అధికారంలో ఉండింది లెఫ్ట్‌వింగ్‌ ప్రభుత్వంకాగా, భారత్‌లో రైట్‌వింగ్‌ ప్రభుత్వం కొనసాగుతోంది.

వామపక్షాలు, అంబేద్కర్‌వాదులు, ఉదారవాదులు, మధ్యంతరవాదులు, లౌకికవాదులు, గోమాంస భక్షకులు, లవ్‌ జిహాదులకు, హిందూత్వవాదులకు మధ్యన ఈ కనిపించని గోడను మోదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. గోవధ నిషేధాలను, గోమాంస భక్షకుల పేరిట దళితులపై జరుగుతున్న దాడులను, హిందూత్వ మూలాలను ప్రశ్నించిన హేతువాదుల హత్యలనుప్రస్తావించరాదు. హిందూత్వాన్ని పూసుకున్న, మోస్తున్న బీజీపీ శక్తులను అసలు విమర్శించరాదు. అలా చేస్తున్న మీడియా గ్రూపులకు నరేంద్ర మోదీగారు ‘న్యూస్‌ ట్రేడర్స్‌’ అని పేరు కూడా పెట్టారు. మరో బీజేపీ సీనియర్‌ నాయకుడు తన నాలుకకు మరింత పదునుపెట్టి ‘ప్రెస్‌టిట్యూట్స్‌’ అని కూడా తిట్టిపోశారు.
 
రిజర్వేషన్ల కోసం గుజరాత్‌లో పటేళ్లు, హర్యానాల్లో జాట్లు చేస్తున్న ఆందోళనలను, తమ హక్కుల సాధన కోసం పోరాడుతున్న దళితులు, ఆదివాసుల ఉద్యమాల ఊసెత్తకుండా తమ పాలనలో భారతీయులు ఎంతగానో సుఖ పడుతున్నారని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వాన్ని, హ్యాపి నేషన్‌ అంటూ సంఘ్‌ పరివార్‌ చేస్తున్న ప్రచారాన్ని, కాశ్మీర్‌తోపాటు దేశంలోని అన్ని సమస్యలకు పాకిస్తాన్‌ కారణమనే నినాదాన్ని మీడియా మరింత ముందుకు తీసుకెళితే మోదీ ప్రభుత్వం సంతోషిస్తోందేమో! ఇప్పటికే తలవరకు వచ్చిన అదృశ్యగోడను త్వరగా పూర్తి చేస్తుందేమో!!     --- ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement