రేపు పాక్ ప్రధానితో మోదీ చర్చలు
రష్యా: దాయాది దేశం పాకిస్థాన్తో చర్చలకు మరో ముందడుగు పడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో రష్యాలో భేటీ అవనున్నారు. అక్కడే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జరగనున్న నేపథ్యంలో పాక్, ఇండియాల మధ్య దౌత్య సంబంధాల విషయాన్ని చర్చించుకునేందుకు షరీఫ్తో మోదీ సమావేశమవుతున్నారు. ఇరు దేశాల విదేశాంగ కార్యాలయాల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 9.15కు సమావేశం ప్రారంభంకానుంది. అయితే, ద్వైపాక్షిక అంశాల్లో వేటికి ప్రాధాన్యం ఇచ్చి ముందు చర్చిస్తారనే విషయాన్ని బహిర్గతం చేయకుండా నేరుగా చర్చలోకి వెళతారని తెలిసింది. అయితే, ఈ సమావేశంలోని చర్చల అనంతరమే పాక్ విషయంలో భారత్ తన అభిప్రాయాలు వెల్లడించనుంది.
కాగా, పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి ఖాజి ఖలిలుల్లా మాట్లాడుతూ భారత్తో సహా తమ పొరుగున ఉన్న దేశాలన్నింటితో సత్సంబంధాలను పెంచుకోవాలని, పరస్పర సమన్వయం, సహకారంతో కొనసాగాలని తమ ప్రధాని షరీఫ్ కోరుకుంటున్నారని తెలిపారు. అయితే, ముందుగా నిర్ణయించుకున్న సమావేశం కాదని, వారం రోజుల కిందటే అనుకూని తెరమీదకు తెచ్చినట్లు తెలిపారు.