ప్లీజ్ నా బిడ్డకు తండ్రెవరో కనుక్కోండి.. | Pregnant French Natalie Amyot tourist is an actress trying to put Mooloolaba on the map | Sakshi
Sakshi News home page

ప్లీజ్ నా బిడ్డకు తండ్రెవరో కనుక్కోండి..

Published Wed, Sep 2 2015 1:53 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ప్లీజ్ నా బిడ్డకు తండ్రెవరో కనుక్కోండి.. - Sakshi

ప్లీజ్ నా బిడ్డకు తండ్రెవరో కనుక్కోండి..

సిడ్నీ: అందమైన సముద్రం పక్కన ఓ రిసార్ట్. ఓ వెన్నెల రాత్రి. పిల్ల గాలులు. ఓ అందమైన అమ్మాయి. మరో క్యూట్ అబ్బాయి. వారికో అందమైన అనుభవం. మరుసటి రోజు ఎవరి గమ్యానికి వారెళ్లి పోయారు. ఆరు వారాలు గడిచాయి. ఆ అందమైన అమ్మాయికి ప్రెగ్నెన్సీ. పుట్టబోయే బిడ్డకు తండ్రెవరు? ఇప్పుడెక్కడున్నారు? కనుక్కోవాలి, ఎలా? అంతే...'ప్లీజ్ నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రెవరో కనుక్కోండి' అంటూ ఆ అమ్మాయి ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఓ వీడియోను మంగళవారం  పోస్ట్ చేశారు.

 

'నా పేరు నటాలీ అమ్యోత్. నాకు 26 ఏళ్లు. నేను పారిస్‌లో ఉంటాను. తల్లీదండ్రులెవరూ లేరు. ఒంటరిని. మూడు నెలలపాటు ఆస్ట్రేలియాలో విహరించేందుకు వెళ్లాను. తిరిగి పారిస్ రావడానికి ఒక రోజు ముందు మూలూలుబా బీచ్‌కు వెళ్లాను. అక్కడ ఓ క్యూట్ అబ్బాయి పరిచయమయ్యాడు. బీచ్ ఒడ్డున ఓ హోటల్ గదిలో ఆ రాత్రి ఉన్నాం. ఓ అందమైన అనుభవాన్ని చవిచూశాం. తెల్లవారి ఎవరంతట వారెళ్లిపోయాం. ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకోవడంతో పారిస్ తిరిగొచ్చాను.

ఆరువారాల తర్వాత నాకు అర్థమైంది. ఆ అబ్బాయి ద్వారా నేను తల్లిని కాబోతున్నానని. అరే! ఎలా? ఆ క్యూట్ అబ్బాయికి ఫోన్‌ చేసి చెబుతామంటే అతని ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్న నా ఫోన్ ట్రావెలింగ్‌లో పడిపోయింది. ఆ అబ్బాయి మూలూలుబా బీచ్‌లో కలసుకున్నాను. అంతకు మించి ఆయన వివరాలు తెలియవు. 183 సంటీమీటర్ల ఎత్తు. అందమైన జుట్టు. కోల ముఖం. బంగారు వర్ణ ఛాయ. ఆయన ఎక్కడ ఉన్నా కనిపెట్టండి ప్లీజ్. మిమ్మల్ని వేడుకుంటున్నా. ఆయనే నా వీడియోను చూసినట్టయితే కచ్చితంగా కనిపెడతారనే విశ్వాసం నాకుంది. నన్ను పెళ్లి చేసుకోకపోయినా సరే. నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఆయనే అని తెలిస్తే అంతే చాలు' అంటూ ఫేస్‌బుక్, యూట్యూబ్ యూజర్లను నటాలీ ఎంతో వేడుకొంది. మంగళవారం ఒక్కరోజులోనే  ఆమె వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. సానుభూతి చూపించినవారు ఉన్నారు. ఆస్ట్రేలియాలో సగం మంది ఆ అమ్మాయి చెప్పిన పోలికల్లోనే ఉంటారు. మరి కనిపెట్టడం ఎలా అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. ఇదేం మాయ రోగం. ముక్కూ మొహం తెలియని వాడితో కడుపు మీదకు తెచ్చుకుంటారా ? అంటూ ఈసడించుకున్న వారూ ఉన్నారు.

బుధవారం ఉదయమే ఫేస్‌బుక్, యూట్యూబ్ యూజర్లకు షాకింగ్ న్యూస్. నటాలిగా చెప్పుకున్న ఆమె 'ఐ ఫౌండ్ హిమ్' పేరిట మరో వీడియో పోస్ట్ చేసింది. అందులో తాను వెతుకుతున్న వ్యక్తి దొరికాడు అంటూ ఆ అమ్మాయి వీడియో తెర మీది నుంచి పక్కకు తప్పుకుంటుంది. ఓ పురుషుడు ముందుకొస్తాడు.

 

తన పేరు ఆండీ సెల్లార్ అని, తాను 'సన్నీ కోస్ట్ సోషల్ మీడియా' కంపెనీ యజమానినని, మొదటి వీడియోలో నటాలీగా నమ్మించిన ఆమె పేరు అలిజీ మిషెల్ అని చెప్పారు. అందులో ఆమె కేవలం పాత్రధారేనని, ఇదంతా మార్కెటింగ్ కోసం తాను పన్నిన వ్యూహమని చెప్పారు. ఆస్ట్రేలియాలో మూలూలుబా నిజంగా అందమైన బీచ్ అని, దాన్ని ప్రచారం చేయడం కోసమే తానీ కట్టుకథ అల్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. మార్కెటింగ్ కోసం ఇలాంటి వీడియోలను ఎన్నైనా సృష్టిస్తానని చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు ఎవరైనా మోసపోవచ్చు. ఎన్నిసార్లు మోసపోతాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement