'కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు' అన్న సామెత ఆ బాలిక విషయంలో సరిగ్గా సరిపోతుంది. అంధుడైన తన తండ్రి.. కొబ్బరి తోటల్లో పనికి వెళ్ళేందుకు ప్రతిరోజూ దారి చూపించే ఆ చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకమౌతోంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఫిలిప్పీన్స్ కు చెందిన ఐదేళ్ళ బాలిక జెన్నీ, కాలికి చెప్పుల్లేకుండా తన అంధ తండ్రి పెపె నెల్సన్ కు పనిలో సహాయపడటం ఇప్పుడు ఫేస్ బుక్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. ఆ చిన్న ప్రాణానికి తండ్రిపై ఉన్న ప్రేమను, బాధ్యతను తెలియజేస్తోంది. కొబ్బరి తోటల్లో తండ్రి పనికి సాయ పడటమే కాదు... ఆప్యాయంగా ఆహారం తినిపించడం, నీళ్ళు అందించడం ప్రతి మనసునూ కదిలింపజేస్తోంది. కూతురి సహకారంతో నెల్సన్ ప్రతిరోజూ సుమారు 60 కొబ్బరి చెట్లు ఎక్కగల్గుతున్నాడు. అందుకుగాను అతడికి అందే 6 డాలర్ల వేతనం.. ఇప్పుడా కుటుంబానికి తిండికి లోటు లేకుండా చేస్తోంది.
ప్రతి గుండెనూ కదిలిస్తున్న ఆ వీడియోను ఫేస్ బుక్ లోని తన పేజీలో రూబీ కెప్యూన్స్ పబ్బిలాన్.. జూన్ 10వ తేదీన పోస్ట్ చేసింది. అప్పట్నుంచీ లక్షలమంది తిలకించడమే కాదు.. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనంగా మారింది. మనసును కదిలించే వీడియోను తిలకించిన ఎంతోమంది వినియోగదారులు సహాయక సంస్థల ద్వారా వారికి తగిన సహకారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీఎస్ సీబీఎన్ ఫౌండేషన్ ఆ తండ్రీ కూతుళ్ళను కలిసింది. రెటినల్ డిటాచ్ మెంట్, రెటినిటిస్ పిగ్మెంటోసా తో బాధపడుతున్న నెల్సన్ కు తగిన ట్రైనింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో నెల్సన్, జెన్నీలు మంచి వాతావరణంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఐదేళ్ళ బాలికే ఆధారం!
Published Thu, Jul 7 2016 1:45 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
Advertisement