సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతీయులకు మంచిరోజులు రానున్నాయి. అమెరికా కాంగ్రెస్ ముందున్న ‘ఫెయిర్‌నెస్ ఫర్ హైస్కిల్డ్ ఇమిగ్రెంట్ యాక్ట్’బిల్లు చట్టరూపం దాల్చితే ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారత సాంకేతిక నిపుణులు వచ్చే మూడేళ్లలోనే తమ కలలను సాకారం చేసుకుంటారు. దాదాపు 3 లక్షల మంది భారతీయ టెకీలు దశాబ్దం కాలంగా హెచ్1–బీ వీసాలపై ఆధారపడి పని చేస్తున్నారు. ఏటేటా హెచ్1–బీ కోసం దరఖాస్తుచేయడం, అది ఆమోదం పొందేదాకా ఒత్తిడికి గురవడం వంటి సమస్యలున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. ఇలాంటి సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అమెరికా మీడియా కథనాలు సూచిస్తున్నారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో భారత్, చైనా తదితర దేశాలనుంచి వచ్చి అమెరికాలో వర్క్ వీసాలపై పని చేస్తున్న లక్షలాది మందికి మూడేళ్లలోనే శాశ్వత నివాసం దక్కుతుందని న్యూయార్క్ టైమ్స్ తన తాజా కథనం స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్ లభించని కారణంగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తుందని, తాజా బిల్లును ఆమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తే ఐటీ నిపుణులకు మంచి వేతనాలు లభిస్తాయని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే ఈ ఏడాది జూన్ నాటికి గ్రీన్‌కార్డుల జారీలో కోటా విధానం రద్దు కావచ్చని అక్కడి వార్తా సంస్థలు చెపుతున్నాయి.
పదేళ్ల క్రితం నాటి దరఖాస్తులకు మోక్షం
అమెరికాలో శాశ్వత నివాసానికి దేశాలవారీ కోటా అమలు చేస్తుండటంతో భారతీయులు పదేళ్ల నుంచి వేచిచూడాల్సి వస్తోంది. 2009 నాటి దరఖాస్తులను ఈ ఏడాది డిసెంబర్ నుంచి క్లియర్ చేసే పనిలో యునైటెడ్ స్టేట్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సీఐఎస్) ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ఏటా 1.40 లక్షల మందికి గ్రీన్‌కార్డులు జారీచేస్తుంది. ఈ లెక్కన భారతదేశానికి చెందిన 9,800 మందికి మాత్రమే శాశ్వత నివాస హోదా దక్కుతోంది. భారత్, చైనా కాకుండా అమెరికాలో హెచ్1–బీ, ఇతర వృత్తి నిపుణుల వీసాపై పని చేస్తున్న ఇతరదేశాల వారికి సులువుగా గ్రీన్‌కార్డ్ వస్తోంది. 2000కు ముందు భారతీయులకు మూడునాలుగేళ్లలోనే గ్రీన్‌కార్డు దక్కేది. కానీ, అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకున్న వారి సంఖ్య పెరగడంతో.. 2002 నుంచి గ్రీన్‌కార్డుల కోసం వేచి చూసే భారతీయుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. యుఎస్‌సీఐఎస్ అందించిన సమాచారం ప్రకారం గతేడాది మార్చి నాటికి 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 3,06,601 మంది భారతీయులే కావడం గమనార్హం. 2018 డిసెంబర్ నాటికి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల సంఖ్య మరో 59 వేలు పెరిగి 4,54,025కు చేరుకోగా.. ఇందులో 3,35,650 మంది భారతీయులే అందులోనూ మెజారిటీ ఐటీ నిపుణులే.
చట్టరూపం దాల్చితే
ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ ముందున్న ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే మొదటి ఏడాదిలోనే దాదాపు లక్ష మంది భారతీయ ఐటీ నిపుణులు శాశ్వత నివాస హోదా పొందుతారు. ఈ లెక్కన మరో మూడునాలుగేళ్లలో గ్రీన్‌కార్డ్ కోసం వేచి చూస్తున్న భారతీయులందరికీ.. శాశ్వత నివాస హోదా దక్కడం దాదాపు ఖాయమే. 2018 నాటికి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ 2022నాటికి గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. అయితే, 2015 నుంచి ఏటా 2లక్షల మంది అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెడుతున్న నేపథ్యంలో వారందరికీ వర్క్ వీసాలు లభిస్తే 2025 నుంచి మళ్లీ బ్యాక్‌లాగ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగం లేదా శాశ్వత నివాస హోదా కోసం అమెరికా వెళ్లాలనుకుంటే అసాధారణమైన తెలివితేటలుండాలని వారంటున్నారు. జీఆర్‌ఈ 312 కంటే ఎక్కువ, టోఫెల్ స్కోర్ 100 దాటేవారికి మంచి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయని, 310 అంతకంటే తక్కువ జీఆర్‌ఈ, 90 కంటే తక్కువ టోఫెల్ స్కోర్‌తో వస్తున్న వారు ఇబ్బందులు పడుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 25ఏళ్లు భారత్‌లోనూ ఐటీ ఉద్యోగాలకు ధోకా ఉండదని, ఖర్చులు తగ్గించుకోవడం కోసం అనేక ముఖ్యమైన కంపెనీలు మానవ వనరులు అత్యధికంగా ఉన్న భారత్‌లో కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఫీచర్డ్ ఆన్ స్లేట్ (అమెరికా) ప్రెసిడెంట్ ఇగోర్ మార్కోవ్ అభిప్రాయపడ్డారు.
మంచి వేతనాలొస్తాయ్!
శాశ్వత నివాస హోదా దక్కితే కంపెనీలపై ఆధారపడే అగత్యం తప్పుతుందని, మంచి వేతనాలు లభిస్తాయని ఆమెరికా ఆర్థిక నిపుణులంటున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఆర్థిక పరిపుష్టతతోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారంటున్నారు. ప్రస్తుతం కంపెనీలు స్పాన్సర్ చేస్తేనే గ్రీన్‌కార్డ్ దరఖాస్తును యుఎస్‌సీఐఎస్ ఆమోదిస్తుంది. ఉద్యోగి ఏ కారణాల వల్ల వైదొలగినా అతని గ్రీన్‌కార్డ్‌ను వెనక్కి తీసుకునే అధికారం కంపెనీలకు ఉంటుంది. దీంతో ఇబ్బంది ఎందుకన్న భావనలో ఐటీ నిపుణులు ఒకే సంస్థలో తక్కువ వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ఒక్కసారి శాశ్వత నివాస హోదా వస్తే సదరు ఉద్యోగి స్వేచ్చగా ఏ కంపెనీలో అయినా ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
గ్రీన్‌కార్డ్ కోటా ఎత్తేస్తే..
Published Sun, Feb 10 2019 2:18 AM | Last Updated on Sun, Feb 10 2019 2:14 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment