ఇస్లామాబాద్‌లో మీడియా సమక్షంలోనే ఓటేస్తున్న ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్: తీవ్రమైన ఆరోపణలు, వాగ్వాదాలు, భారీ హామీల అనంతరం బుధవారం పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగియగానే.. ఏడు గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఫలితాలు హోరాహోరీగా ఉంటాయని.. పీఎంఎల్–ఎన్, పీటీఐ మధ్య నువ్వా–నేనా అన్నట్లుగా పోటీ ఉండొచ్చని ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే.. తాజా ఫలితాల ప్రకారం పాకిస్తాన్ ప్రధాని పీఠం.. మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కే దక్కే అవకాశాలు కనబడుతున్నాయి.
పాకిస్తాన్ పార్లమెంటులోని 272 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీటీఐ పార్టీ కడపటి వార్తలందేసరికి 107 స్థానాల్లో ముందంజలో ఉంది. మెజార్టీకి అవసరమైన 137 సీట్ల దిశగా దూసుకెళ్తోంది. పీఎంఎల్–ఎన్ 70 సీట్లలో, పీపీపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ముత్తహిదా క్వామీ మూమెంట్ (ఎంక్యూఎం) 11 చోట్ల దూసుకుపోతోంది. 55కి పైగా స్థానాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు. ఒకవేళ హంగ్ వచ్చే పరిస్థితులుంటే పీపీపీ కింగ్‌మేకర్ కానుందని పాకిస్తాన్ విశ్లేషకులంటున్నారు. ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల సాయంతో ఇమ్రాన్ పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనబడుతోంది. షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్‌ఎన్‌ను గద్దెదించేందుకు పీటీఐ చేసిన ప్రయత్నానికి ఐఎస్‌ఐతోపాటు పాక్ ఆర్మీ లోపాయకారిగా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా ఫలితాలతో పీటీఐ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కౌంటింగ్ జరుగుతుండగానే ఇమ్రాన్ అనుచరులు సంబరాలు ప్రారంభించారు. ఉగ్రదాడుల్లో అభ్యర్థులు చనిపోవడంతో రెండుచోట్ల ఎన్నిక వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 2017 పాకిస్తాన్ జనగణన ఆధారంగా నియోజకవర్గాలను విభజించి ఎన్నికలు నిర్వహించారు. దీని ప్రకారం ఇస్లామాబాద్ నగరంలోనే మూడు ఎంపీ సీట్లున్నాయి. ఇవి కాకుండా పంజాబ్లో 141, సింధ్‌లో 61, ఖైబర్–ఫక్తున్‌ఖ్వాలో 39, బెలూచిస్తాన్‌లో 16, గిరిజన ప్రాంతాల్లో 12 సీట్లున్నాయి.
విపక్షాల రిగ్గింగ్ ఆరోపణలు
రిగ్గింగ్ కారణంగానే పీటీఐ మెజారిటీ గెలిచిందంటూ విపక్ష పీఎంఎల్–ఎన్, పీపీపీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని పీఎంఎల్‌ఎన్ ఆరోపించింది. చాలాచోట్ల తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లనుంచి బయటకు గెంటేశారని ఆరోపించింది. పీపీపీ కూడా ఎన్నికలు సవ్యంగా జరగలేదని చాలాచోట్ల రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కరాచీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను బెదిరించి బయటకు పంపించారని పేర్కొంది. దీనిపై ఈసీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రావిన్సుల్లో..
పంజాబ్ ప్రావిన్సులో పీఎంఎల్–ఎన్ మెజారిటీకి చేరువలో ఉన్నట్లు సమాచారం. కీలకమైన పంజాబ్ ప్రావిన్సు అసెంబ్లీ ఎన్నికల్లో 297 సీట్లలో ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో పీఎంఎల్–ఎన్ 131 సీట్లలో పీటీఐ 70 స్థానాలను గెలుచుకున్నాయి. సింధ్ అసెంబ్లీ ప్రావిన్సులో తన కంచుకోటను పీపీపీ కాపాడుకుంటోంది.. ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 131 సీట్లలో ఫలితాలు వెల్లడైన 92 సీట్లలో పీపీపీ 60 చోట్ల ముందంజలో ఉంది. ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా ప్రావిన్సులో పీటీఐ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఓటింగ్ కొనసాగిందిలా!
ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 85వేల పోలింగ్ కేంద్రాల్లో జరిగింది. ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. సాయంత్రం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఈసారి ఎన్నికల్లో 30 వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టెన్షన్ వాతావరణంలోనూ పాకిస్తాన్ ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. 10.6 కోట్ల మంది ఓటర్లలో 53 శాతం మంది ఓటింగ్ వినియోగించుకున్నారు.
ఇమ్రాన్, షాబాజ్‌లపై ఈసీపీ సీరియస్
ఎన్నికల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, పీఎంఎల్–ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, మాజీ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లపై ఈసీపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామాబాద్ నుంచి ఎంపీగా బరిలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ తన ఓటును రహస్యంగా ఉంచకుండా మీడియాకు చూపిస్తూ ఓటేశారు. దీంతో ఆయన ఓటును రద్దు చేసిన ఎన్నికల సంఘం.. సోమవారం తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఆరేళ్ల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షాబాజ్, ఆసిఫ్‌లు కూడా మీడియాతో మాట్లాడినందున వీరిపై చర్చలు తీసుకుంటారని సమాచారం.
ఎన్నికలు హింసాత్మకం
ఆత్మాహుతి దాడిలో 35 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంటు, 4 ప్రావిన్సుల (పంజాబ్, సింధ్, ఖైబర్–ఫక్తున్‌ఖ్వా, బెలూచిస్తాన్) అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల సందర్భంగా దేశంలో పలుచోట్ల హింస ప్రజ్వరిల్లింది. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 35 మంది మృతిచెందగా.. 67 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పాక్ నైరుతి ప్రాంతమైన క్వెట్టాలో పోలింగ్‌బూత్ బయట ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలోనే 31 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం కారణంగా మరో నలుగురు హత్యకు గురయ్యారు. బెలూచిస్తాన్ రాజధాని అయిన క్వెట్టాలోని అతిసున్నిత ప్రాంతమైన ఎన్‌ఏ–360 నియోజకవర్గంలో అనుమానాస్పద వ్యక్తిని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు ఆపేశారు. భారీ బందోబస్తు కారణంగా లోపలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వెంటనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
గెలుపును లెక్కించేదెలా?
ఎన్నికలు జరిగిన 272 సీట్లలో మెజారిటీ స్థానాల్లో ముందుగా గెలవాలి. ఆ తర్వాత మిగిలిన 70 సీట్ల (60మంది మహిళలు, 10 మంది భాషా ప్రాతిపదికన మైనారిటీ ప్రతినిధులు) ను ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా పంచుతారు. ఆ తర్వాత మొత్తం 172 పొందిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. అయితే.. దాదాపుగా 137 సీట్లు పొందిన పార్టీ లేదా కూటమి మిగిలిన స్థానాలను పొందటం పెద్ద కష్టమేంకాదు.
అప్పుడు కెప్టెన్..ఇప్పుడు పీఎం?
పాకిస్తాన్ ప్రధాని రేసులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ 1996లో పీటీఐ పార్టీని స్థాపించారు. అంతకుముందు, క్రికెట్ క్రీడాకారుడిగా చిరపరిచితులే. 1992లో ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించారు. ఆ తరువాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సామాజిక సేవకు అంకితమయ్యారు. తన తల్లి జ్ఞాపకార్థం 1994లో లాహోర్‌లో, 2015లో పెషావర్‌లో రెండు కేన్సర్ ఆసుపత్రులను నెలకొల్పారు. 2002లో తొలిసారి మియాన్‌వాలి స్థానం నుంచి జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2013 ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2005–14 మధ్య బ్రాడ్‌ఫోర్డ్ యూనివర్సిటీ(ఇంగ్లండ్)కి చాన్స్‌లర్‌గా వ్యవహరించారు. 1952లో లాహోర్‌లో జన్మించిన ఇమ్రాన్‌ఖాన్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆయన ఈ ఏడాది బుష్రా మానికా అనే మహిళను మూడో వివాహం చేసుకున్నారు. తన అనుచరులు ఇప్పటికీ ఇమ్రాన్‌ను కప్తాన్, కెప్టెన్ అని పిలుచుకుంటారు.
ఇమ్రాన్‌తో భారత్‌కు ముప్పే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ ముందంజలో ఉంది. దాయాది దేశమైన పాకిస్తాన్‌లో సంభవించే రాజకీయ పరిణామాలు భారత్‌పై కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ గెలిస్తే భారత్–పాక్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ చాలా కాలంగా భారత వ్యతిరేక ధోరణే ప్రదర్శిస్తున్నారు.
భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ నవాజ్ షరీఫ్‌పై నిప్పులు కక్కుతున్నారు. భారత ప్రధాని మోదీ భాషలోనే నవాజ్ మాట్లాడుతున్నారని గతంలో ఇమ్రాన్ విమర్శలు చేశారు. నవాజ్‌ను ఆధునిక మీర్ జాఫర్‌తో పోల్చారు. పాక్‌లో చాలా కాలం పాటు అధికారం చెలాయించిన సైన్యానికి అనుకూలుడిగా ఉండటమే కాక దేశాన్ని సైన్యమే పాలించాలన్న అభిప్రాయంలో కూడా ఆయన ఉన్నారు. అంతే కాకుండా ఇస్లామిక్ సంప్రదాయాల కొనసాగింపునకు ఇమ్రాన్ సానుకూలమన్నది ఆయన ప్రకటనల్లోనే నిరూపితమవుతోంది.
దేశ ప్రధాని కావాలన్న ప్రగాఢ వాంఛ ఇమ్రాన్‌కు ఉంది. పార్టీ పెట్టిన కొత్తలో ఇస్లామిక్ తీవ్రవాదానికి, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. అయితే, 2013 ఎన్నికల్లో ఘోరంగా ఓడి పోవడంతో తన వైఖరి మార్చుకున్నారు. మత ఛాందసవాదిగా మారడంతో పాటు సైన్యానికి దగ్గరయ్యా రు. పాక్‌లోని ఉగ్ర సంస్థ హర్కతుల్ మొజాహిదీన్ అధినేత మౌలానా ఫజులుర్ రెహమాన్ వంటి వారు ఇమ్రాన్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇమ్రాన్‌కు పాక్ సైన్యం, ఐఎస్‌ఐ, తాలిబాన్, ఇతర ఉగ్ర సంస్థల మద్దతు కూడా ఉందన్నది కాదనలేని వాస్తవం.
సైన్యం జోక్యం పెరుగుతుంది
ఒకవేళ ఇమ్రాన్ పార్టీయే అధికారంలోకి వస్తే పాలనలో మళ్లీ సైన్యం జోక్యం ప్రబలడం ఖాయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సైన్యం పెత్తనం చేపడితే భారత్‌కు సమస్యలు తప్పవని వారి భావన. ఇమ్రాన్ అధికారంలోకొస్తే పాక్‌లోని భారత వ్యతిరేక ఉగ్రసంస్థలకు మరింత బలం చేకూరుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైన్యంతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ బలంగా సంకేతాలు పంపుతున్నారని ‘ఉడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ థింక్ ట్యాంక్’ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ ఇటీవల అల్‌జజీరాకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ‘ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకూడదనీ, హంగ్ రావాలని సైన్యం ఆశిస్తోంది. ఎవరికీ మెజారిటీ రాకపోతే తాను చక్రం తిప్పవచ్చన్నది సైన్యం ఆలోచన. ఆ పరిణామం భారత్‌కు మంచిది కాదు. పాక్‌కు కూడా ప్రయోజనకరం కాదు’ అని పేర్కొన్నారు.
క్వెట్టాలో ఆత్మాహతి దాడిలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
లాహోర్‌లో ఓటు హక్కువినియోగించుకుంటున్న హఫీజ్ సయీద్
Comments
Please login to add a commentAdd a comment