నేను ఆ తప్పు చేయలేదు!
టికెట్ చూపించమని అడిగినందుకు రైల్వే సెక్యూరిటీ గార్డుపై దాడిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌వీర్ సంధూ తాజాగా కోర్టు విచారణకు హాజరయింది. సెంట్రల్ లండన్‌కు సమీపంలోని స్లౌఘ్ పట్టణంలో నివాసముంటున్న ఆమె తాను ఏ తప్పు చేయలేదని, ఆత్మరక్షణ కోసమే సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నానని రీడింగ్ క్రౌన్ కోర్టుకు వాంగ్మూలమిచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 7న స్లౌఘ్ రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డు, టికెట్ కండక్టర్‌తో దురుసుగా వ్యవహరించి జాతివివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసినట్టు సంధూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది.
టికెట్ చూపించాలని అడిగినందుకు 'కోతి' అని దూషించి నానా దుర్భాషలాడినట్టు ఆమెపై పోలీసులు అభియోగాలు మోపారు. టికెట్ లేదని ఆమెను సెక్యూరిటీ గార్డు నిలిపివేయడంతో ఈ గొడవ జరిగింది. అయితే, 25 ఏళ్ల సంధూ వద్ద సీజన్ టికెట్ ఉన్నట్టు తర్వాత సెక్యూరిటీ గార్డు, కండక్టర్ గుర్తించారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో తమపై సంధూ చేయిచేసుకున్నదని, నానా దుర్భాషలాడుతూ, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ రభస సృష్టించిందని సెక్యూరిటీ గార్డు బ్రాండన్ థాంప్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, తనపై అతడు చేసిన అభియోగాలను సంధూ పూర్తిగా తిరస్కరించింది. తాను అతనిని ఉద్దేశించి జాతివివక్ష వ్యాఖ్యలు చేయలేదని, అతడే తనపై దాడికి దిగాడని, దీంతో ఆత్మరక్షణ కోసమే చేయి చేసుకున్నానని స్పష్టం చేసింది. తనపై సెక్యూరిటీ గార్డు దాడి చేశాడని, ఈ కేసులో తానే బాధితురాలనంటూ మొదట సంధునే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇరువర్గాలవారి తరఫు లాయర్ల వాదనలు విన్న క్రౌన్ కోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.