ఐఎస్‌ఐఎస్‌పై 'రాంబో' పోరాటం
వాషింగ్ఘన్: రాంబో సిరీస్ సూపర్ హిట్ ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టలోన్ అదే సిరీస్‌లో ఐదవ పార్ట్ తీయబోతున్నారు. సిరియా, ఇరాక్‌లలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను తుదముట్టించడమే స్థూలంగా ఈ సినిమా ఇతివృత్తం. 2011 నుంచే రాంబో-లాస్ట్‌బ్లడ్ పేరిట ఐదో పార్ట్‌ను తీయాలనుకుంటున్న స్టలోన్.. కథాంశం విషయంలో మొన్నటి వరకు ఓ నిర్ణయానికి రాలేక పోయారు. తన మరో హిట్ సిరీస్‌లో భాగంగా తీసిన తాజా చిత్రం 'నెక్స్ట్‌రాఖీ' ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల శాన్‌డియాగోకు వచ్చిన స్టలోన్ 'రాంబో:లాస్ట్‌బ్లడ్'కు కథ ఖరారైందని, తానే స్క్రీన్ ప్లే రాస్తున్నానని తెలిపారు. తాను హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం కూడా వహిస్తున్నట్టు చెప్పారని 'వాషింగ్ఘన్ టైమ్స్' పత్రిక వెల్లడించింది. షూటింగ్ కోసం అనువైన ప్రదేశాలను వెతకడం కోసం అప్పుడే తన టీమ్ సిరియా, ఇరాక్‌లలో పర్యటిస్తున్నట్టు స్టలోన్ తెలిపారు. అంతకుమించి ఈ సినిమాకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
'హంటర్' అనే నవల ఆధారంగా బల్గేరియాలో తాను రాంబో: లాస్ట్‌బ్లడ్ తీస్తున్నట్టు స్టలోన్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అందులో డ్రగ్ మాఫియా తన కూతురిని కిడ్నాప్ చేస్తే వారిని వేటాడి, వారి నుంచి కూతురిని రక్షించుకోవడం అందులోని ఇతివృత్తం. ఇప్పుడు దక్షిణాసియాలో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను తుదముట్టించడమే ఇతివృత్తం అని చెబుతున్నందున.. బహుశా ఇందులో కూడా తన కూతురిని కిడ్నాప్ చేసిన ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులపై ప్రతీకారం తీసుకోవడం ఇతివృత్తంగా ఉండొచ్చు. ప్రపంచ యుద్ధాల్లో అమెరికా విధానానికి అనుగుణంగానే ఎప్పుడు రాంబో పాత్ర ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఐఎస్‌ఐఎస్‌పై అమెరికా ప్రస్తుత విధానానికి అనుగుణంగానే రాంబో పాత్ర ఉంటుందనడంలో సందేహం లేదు.
సోవియట్-అఫ్ఘాన్ యుద్ధం సందర్భంగా తన వియత్నాం కమాండింగ్ ఆఫీసర్‌ను విడిపించే ఏకైక మిషన్‌పై అఫ్ఘాన్ వెళ్లడం, అక్కడ వీరోచితంగా పోరాడడం ఇతివృత్తంగా రాంబో-3 సినిమా 1988లో వచ్చిన విషయం తెలిసిందే. 'ఈ సినిమా అఫ్ఘానిస్తాన్‌లోని ముజాహిద్దీన్ ధీర యోధులకు అంకితం' అనే వ్యాక్యంతో ముగుస్తుంది. 2011 వరకు ఈ వ్యాక్యం ఇలాగే ఉండింది. ఎప్పుడైతే ముజాహిద్దీన్‌లు అల్‌ఖైదాలతో కలిసిపోయారో అప్పుడు 'అఫ్ఘాన్ ధీర యోధులకు అంకితం' అని మార్చారు. అంటే అమెరికా విదేశీ విధానానికి అనుగుణంగా వ్యాక్యంలోని ముజాహిద్దీన్ అనే పదాన్ని తొలగించారన్నమాట. ఈ విషయాన్ని పక్కనపెడితే 68 ఏళ్ల ప్రాయంలో పడిన స్టలోన్ గతంలోలాగా మెప్పించగలడా ?అన్నది ప్రశ్న.