న్యూఢిల్లీ: నేపాల్ ప్రభుత్వానికి చైనా గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది. త్వరలోనే అక్కడ అవుట్‌పోస్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం నివేదిక ఈ విషయాన్ని వెల్లడించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. ఆ వివరాల ప్రకారం.. ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్న నదుల గమనాన్ని మళ్లించి నేపాల్‌లోని 10 ప్రాంతాలను డ్రాగన్ ఆక్రమించింది. చైనా చేపడుతున్న నిర్మాణాల వల్ల హమ్లా జిల్లాలోని 10 హెక్టార్లు, రసువా జిల్లాలోని ఆరు హెక్టార్ల భూభాగం దురాక్రమణకు గురైంది. (చైనా మరో ఎత్తుగడ.. బంగ్లాదేశ్‌తో బంధం!)
అదే విధంగా టిబెట్‌లో నిర్మిస్తున్న రోడ్డును పూర్తి చేసేందుకు... సంజంగ్, కామ్‌ఖోలా నది గమనాన్ని మళ్లించి.. 9 హెక్టార్లు, ఖరానే ఖోలా, భోటే కోసీలోని 11 హెక్టార్ల భూమిని డ్రాగన్ ఆక్రమించింది. అంతేగాకుండా భవిష్యత్తులో మరింత భూభాగాన్ని ఆక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయని సర్వే వెల్లడించింది. కాగా భారత భూభాగంలోని లిపులేఖ్, లింపియదుర, కాలాపానీ ప్రాంతాలను తమ దేశంలోని భూభాగాలుగా చూపిస్తూ నేపాల్ కొత్త మ్యాప్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. (అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తోన్న నేపాల్)
అంతేగాక ఇటీవల బిహార్‌లోని కొంత ప్రాంతాన్ని తమ భూభాగంగా పేర్కొంటూ మరో దుస్సాహసానికి పూనుకుని... బిహార్ జల వనరుల శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాకు మరింత దగ్గరైన నేపాల్‌కు డ్రాగన్ తాజా చర్య ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. కాగా గత కొన్ని రోజులుగా భారత్‌ను విమర్శిస్తున్న నేపాల్ పాలకులు... చైనా హాంకాంగ్‌లో ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment