వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. వందలాది ప్రాణాలు బలితీసుకుంటూ భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో ఇప్పటికే అక్కడ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ఆ రాష్ట్రాలకు వెళ్లకూడదంటూ అధికార వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తాజాగా దేశం మొత్తం మీద కరోనా ధాటికి ఒక్కరోజే 865 మంది మృత్యువాత పడ్డారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం నాటికి కరోనా మరణాల సంఖ్య 3873కు చేరిందని తెలిపింది.(కరోనా: న్యూయార్క్ గవర్నర్ భావోద్వేగం)
కాగా అమెరికాలో కరోనా సంఖ్య సోకిన వారి సంఖ్య 188172కు చేరింది. కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మాట్లాడుతూ.. రాబోయే రెండు వారాలు తీవ్రమైన బాధను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ఇది ప్లేగు వంటిది. ప్రతీ అమెరికా పౌరుడు కరోనా, దాని వల్ల ఎదురయ్యే కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’’అని విజ్ఞప్తి చేశారు.(కరోనా వైరస్‌తో కొత్త లక్షణాలు)
ఇక అమెరికా కరోనాతో పూర్తిస్థాయిలో పోరాడుతోందని... అయితే మహమ్మారి ధాటికి 2,40,000 అమెరికన్లు మృత్యువాత పడే అవకాశం ఉందని శ్వేతసౌధ వర్గాలు హెచ్చరించాయి. కరోనాను కట్టడి చేసేందుకు మ్యాజిక్ వ్యాక్సిన్ గానీ.. చికిత్స గానీ లేదని... మనుషుల ప్రవర్తన, క్రమశిక్షణ మీదే కరోనా వ్యాప్తి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాయి. కాబట్టి ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలు దాటగా... 40 వేల మందికి పైగా మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment