రిటైరయ్యాకే చురుగ్గా ఉంటారు!
ఉద్యోగం చేసే వారికన్నా పదవీ విరమణ చేసినవారే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు పరిశోధకులు. రిటైర్మెంట్ తర్వాత ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ఉండటం, హాయిగా నిద్రపోవడంతోపాటు, ధూమపానానికి దూరంగా ఉంటున్నారని తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. ఆస్ట్రేలియా ప్రజలపై చేసిన పరిశోధనల్లో ఈ సరికొత్త విషయాలను తెలుసుకున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తుల జీవనశైలిపై ప్రత్యేక పరిశోధనలు జరిపారు. రిటైర్ అయిన వ్యక్తుల్లో శారీరక శ్రమ, ఆహార, నిద్ర అలవాట్లు, ప్రవర్తన, మద్య సేవనం వంటి అనేక విషయాల్లో పరిశోధనలు నిర్వహించినట్లు అధ్యయనవేత్త మెలోడీ డింగ్ తెలిపారు.
ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వ్యక్తులతో పోలిస్తే... రిటైర్ అయిన వారు విశ్రాంతి తీసుకునే సమయం తగ్గించుకొని, ఎక్కువ సమయం శ్రమించగల్గటం, ధూమపానానికి దూరంగా ఉండటంతోపాటు... శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో చురుగ్గా ఉంటున్నట్లు గమనించారు. అంతేకాక ఎంతో ఆరోగ్యంగా కూడ ఉంటున్నట్లు అధ్యయనాల్లో తేలిందని డింగ్ చెప్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వ్యక్తుల జీవనశైలిలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయని, చెడు అలవాట్లకు దూరంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవితం గడుపుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.
ఉద్యోగ విరమణ అనంతరం వ్యక్తులు ఎంతో చురుగ్గా ఉండగల్గుతున్నారని, వారానికి 93 నిమిషాల శారీరక శ్రమ పెంచడంతోపాటు, బద్ధకంగా కూర్చునే సమయాన్ని 67 నిమిషాలు తగ్గించారని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. అంతేకాక నిద్రించే సమయం కూడ రోజుకు సుమారు 11 నిమిషాలు పెంచగలిగినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగినులు 50శాతం మంది రిటైర్మెంట్ తర్వాత ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు కనుగొన్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవనశైలిని ఆరోగ్యంగా మార్చుకునేందుకు కావలసిన సమయం దొరుకుతోందని, ఇది అన్ని తరహాల్లోనూ కీలకపాత్ర పోషించిందని డింగ్ తెలిపారు.
అయితే ఈ సమయంలో మద్యపానం, కూరగాయలు, పండ్లు వాడకాల్లో పెద్దగా మార్పులు కనిపించలేదంటున్నారు. ఇదిలా ఉంటే... పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు, అధిక విద్యాస్థాయిలు కలిగినవారు మాత్రం కాస్త ఎక్కువ సమయం ఖాళీగా కూర్చుని సమయం గడుపుతున్నట్లు కనుగొన్నారు. రిటైర్మెంట్ గురించి ప్రజలు సానుకూలంగా ఆలోచించేందుకు ఈ తాజా పరిశోధన సహకరిస్తుందని డింగ్ చెప్తున్నారు. డాక్టర్లకైతే రిటైర్మెంట్ లైఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారి పేషెంట్లతో తీరిగ్గా మాట్లాడేందుకు సమయం దొరుకుతుందని ప్రివెంటివ్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనాల్లో ఆమె తెలిపారు.