
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రజాదరణ ఒక్కసారిగా పడిపోయింది. పింఛను సంస్కరణల నేపథ్యంలో సాధారణ ప్రజానీకంలో 39 శాతం మంది మాత్రమే ఆయన్ను నమ్ముతున్నట్లు ఓ సర్వేలో వెల్లడయింది. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను ఆక్రమించుకున్న తర్వాత ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. పుతిన్ ప్రజాదరణ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 9 పాయింట్లు తగ్గిందని లెవడ–సెంటర్ అనే స్వతంత్ర సంస్థ చేపట్టిన సర్వే తెలిపింది.
2017 నవంబర్ నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే మొత్తంగా 20 పాయింట్లు పడిపోయినట్లు పేర్కొంది. రిటైర్మెంట్ వయస్సును పురుషులకు 65 ఏళ్లు, మహిళలకు 60 ఏళ్లకు పెంచుతూ పుతిన్ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.