‘పిజ్జా’కు తాత్కాలిక విముక్తి
బీజింగ్: ధ్రువపు ఎలుగుబంటి 'పిజ్జా'కు కష్టాలు తాత్కాలికంగా తప్పాయి. బందిఖానా నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ప్రపంచంలోనే దారుణ విషాదాన్ని చవిచూస్తోన్న ఎలుగుబంటి'గా ముద్రపడిన 'పిజ్జా'కు విముక్తి లభించింది. ఉత్తర చైనాలోని ఝంగ్షూ పట్టణంలో ఉన్న గ్రాండ్ వ్యూ షాపింగ్ మాల్ నుంచి దాన్ని బయటికి తరలించారు.
ఆదివారం వీడ్కోలు విందు తర్వాత దాన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎక్కడికి తరలించారనేది షాపింగ్ మాల్ నిర్వాహకులు వెల్లడించలేదు. ‘ఫేర్ వేల్ పార్టీ తర్వాత బందోబస్తు నడుమ అక్వేరియం నుంచి పిజ్జాను తరలించామ’ని తెలిపారు. ‘పిజ్జా’ జన్మస్థలం టియన్ జిన్ కు దాన్ని తరలించివుంటారని చైనా మీడియా పేర్కొంది. షాపింగ్ మాల్ లోని మిగతా అరుదైన జంతువులకు విముక్తి లభించలేదు.
అయితే జంతువులను ఉంచిన ఎన్ క్లోజర్లు నవీకరిస్తున్నామని, ఈ పనులు పూర్తైన తర్వాత ‘పిజ్జా’ను తిరిగి తీసుకొస్తామని షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రకటించారు. అరుదైన జంతువులను వ్యాపార ప్రయోజనాల కోసం ఇరుకైన గదుల్లో బంధించి హింసించడం పట్ల జంతు ప్రేమికులు ఆందోళన చేయడంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు దిగివచ్చారు. ‘పిజ్జా’కు తాత్కాలిక ఉపశమనం కలిగించారు.
చదవండి: చైనాలో మరో వ్యాపార వికృతం