జ్ఞానతృష్ణను తీర్చే ఒయాసిస్సు
నీరున్న చోట, పచ్చదనం ఉన్న చోట జ్ఞానం మొలకెత్తుతుంది. చిగురిస్తుంది. ఆకులు, కొమ్మలు వేస్తుంది. ఊడలు కూడా దిగుతుంది. అది ఎడారి అయినా సరే, జ్ఞానం ఒయాసిస్సై దాహాన్ని తీరుస్తుంది. అలాంటి ఒక విజ్ఞాన ఒయాసిస్సు ఈజిప్టు ఎడారిలో నిర్మాణం కాబోతోంది.
ఈజిప్టు పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది.... భారీ సైజు పిరమిడ్లు... ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి. అంతేనా? మరి... ఇసుక ఎడారి మధ్యలో పచ్చటి ఓ ఒయాసిస్సు ఉంటే? ఈ ఆలోచనకు రూపమిస్తే పక్క ఫొటోల్లో చూపినట్టుగా ఉంటుంది. విషయమేమిటంటే... ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో ఓ అత్యాధునిక పరిశోధనశాల, మ్యూజియమ్ ఒకదాన్ని నిర్మించాలని బిబిలోథికా అలెక్సాండ్రినా అనే సంస్థ సంకల్పించింది. కైరోకు పశ్చిమ దిక్కున ఎడారిలో కట్టబోయే ఈ సైన్స్ సిటీ డిజైనింగ్‌కు ఓ పోటీ నిర్వహించింది.
దాదాపు 446 సంస్థలు పోటీపడగా... వాటిల్లో వెస్టన్ విలియమ్‌సన్ ఆర్కిటెక్చర్ సంస్థ ప్రతిపాదించి, పోటీలో విజయం సాధించిన డిజైన్లు ఇవి. జ్ఞానతృష్ణను తీర్చే ఒయాసిస్సు ఇదీ అన్న విధంగా వీరు దీన్ని డిజైన్ చేశారు. మొత్తం 13.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. దూరం నుంచి చూస్తే తెల్లటి పైకప్పుల్లా కనిపిస్తున్నాయి చూడండి... వాటిల్లోనే ఓ ప్లానెటోరియం, ఇంకో మ్యూజియమ్, అబ్జర్వేషన్ టవర్‌లతోపాటు కాన్ఫరెన్స్ సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు... ఈ గుండ్రటి పైకప్పుల ద్వారా వాననీటిని ఒడిసిపట్టడంతోపాటు... సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు.