
ఎర్రకోట పాకిస్థాన్‌దట!
అదొక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఆస్థానాలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను అందులో ప్రదర్శిస్తున్నారు.
బీజింగ్: అదొక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఆస్థానాలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను అందులో ప్రదర్శిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది చైనాలోని షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) అనే సంస్థ. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత ప్రతినిధి విజయ్ గోఖలే, పాకిస్థాన్ ప్రతినిధి మసూద్ ఖలీద్ ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఇంతలో ఓ ఛాయా చిత్రాన్ని ప్రదర్శిస్తూ దాన్ని లాహోర్‌లోని షాలిమార్ గార్డెన్స్‌గా పేర్కొన్నారు. దీంతో అక్కడ ఉన్న భారత, పాక్ అధికార ప్రతినిధులు, రాయబారులు అవాక్కయ్యారు.
ఎందుకంటే వారు లాహోర్ షాలిమార్ గార్డెన్స్‌గా చెబుతూ ప్రదర్శించిన ఛిత్రం మూడు రంగుల భారత జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తున్న ఎర్రకోట. వెంటనే ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకులకు తెలిపి గుర్రుమన్నారు. దీంతో ఎస్‌సీవో అధికారులు జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. ఛాయ చిత్రాలను ప్రదర్శించే సమయంలో తాము మరొకసారి తనిఖీ చేసుకోవాల్సి ఉండాల్సిందని అన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమంలో భారత్, పాక్ పాల్గొనడం ఇదే తొలిసారి. కాగా, గురువారం రెండు దేశాల జాతీయ జెండాలను ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎగురవేయనున్నారు. ఆ సమయంలో ఇరు దేశాల ప్రతినిధులు డ్రమ్స్ మోగించి సందడి చేస్తారు.