సీటు బెల్టు కత్తిలా మారి ఆమె కడుపును.. | Seat Belt Cuts Young Woman Stomach Like Sword In Michigan | Sakshi
Sakshi News home page

సీటు బెల్టు ఆమె కడుపును చీల్చింది

Published Wed, Jul 31 2019 7:35 PM | Last Updated on Wed, Jul 31 2019 7:40 PM

Seat Belt Cuts Young Woman Stomach Like Sword In Michigan - Sakshi

మిచిగాన్‌ : ఓ కారు ప్రమాదంలో సీటు బెల్టు కత్తిలా మారి చోదకురాలి కడుపును చీల్చివేసింది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డా.. శరీరం మాత్రం చెరిగిపోని గాయంతో చిరుగులు పడ్డ గుడ్డముక్కలా తయారైంది. వివరాల్లోకి వెళితే.. మిచిగాన్‌కు చెందిన గీనా ఆర్నాల్డ్‌ 2017 ఆక్టోబర్‌లో తన సొంత కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. దాదాపు 7 సార్లు కారు పల్టీలు కొట్టడంతో రక్షణ కోసం ధరించిన సీటు​ బెల్టు ఓ కత్తిలా మారి కడుపును చీల్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మూడు నెలల పాటు ఇన్‌టెన్సివ్‌ కేర్‌లో గడిపింది. దాదాపు 20 అత్యవసర సర్జరీల అనంతరం ప్రాణాలతో బయటపడగలిగింది. గీనా ఆర్నాల్డ్‌ మాట్లాడుతూ.. ‘‘ ఆ రోజు ఏం జరిగిందో నాకు సరిగా గుర్తులేదు. ప్రమాదం జరిగినపుడు వర్షం పడిందని, కారు నా కంట్రోల్‌ తప్పి ప్రమాదానికి గురైందని తర్వాత తెలిసింది. నా కారు ఏడు సార్లు పల్టీలు కొట్టి, చెట్టును ఢీకొట్టిందని సంఘటన జరిగిన రోజు అక్కడున్న వ్యక్తి చెప్పాడు.  

సీటు బెల్టు కత్తిలా మారి నా పొట్టను చీల్చినా.. నా అదృష్టం అది పెట్టుకోవటం వల్ల ప్రాణాలతో బయటపడగలిగాను. ఆ తర్వాత నేను మూడు రోజులు కోమాలో ఉన్నాను. నా రెండు ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఏ ఏ ఎముకలు విరిగాయో తెలుసుకోవటానికి డాక్టర్లకు ఓ వారం రోజులు పట్టింది. నన్ను ప్రాణాలతో రక్షించటానికి అత్యవసర సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఆ నొప్పిని నా జీవితంలో నేనెప్పుడూ భరించలేదు. సర్జరీలు జరిగినా నడుస్తానన్న నమ్మకం ఉండేది కాదు. నా కడుపులోని చాలా భాగాన్ని తొలగించాల్సి వచ్చింద’’ని తెలిపింది. 14నెలల తర్వాత కోలుకున్న గీనా దివ్యాంగులకు సేవ చేస్తూ జీవితాన్ని గడిపేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement