ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోడం వ్యాపార, వాణిజ్య వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, నిపుణులు అన్వేషిస్తున్నారు. మిస్త్రీతో పాటు కారు వెనుక సీట్లో కూర్చున్న జహంగీర్ పండోలే.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నిపుణులు అంటున్నారు. వారిద్దరూ కనుక సీట్ బెల్ట్ ధరించివుంటే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకుని ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన కారు పరిశీలిస్తే ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. దీంతో ముందు సీట్లో ఉన్న డేరియస్ పండోలే, కారు నడుపుతున్న ఆయన భార్య డాక్టర్ అనాహిత గాయాలతో బయటపడ్డారు. వారిద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకుని ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణాలు నిలుపుకున్నారు. (క్లిక్: మిస్త్రీ హఠాన్మరణం.. ఆనంద్ మహీంద్ర భావోద్వేగం)
సెక్యురిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ..
కారుకు ఒకవైపు మాత్రమే అమర్చినట్లుగా కనిపించే నీలం రంగు సైడ్-కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. మిస్త్రీ, జహంగీర్ సీటు బెల్ట్ ధరించపోవడంతో వారి సీట్లలో నుంచి ఎగిరిపడివుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ జీఎల్‌సీ ఎస్‌యూవీలో అత్యంత సురక్షితమైన సెక్యురిటీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ అజాగ్రత్త కారణంగానే మిస్త్రీ, జహంగీర్ ప్రాణాలు కోల్పోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే వెనుక సీటులో సీట్ బెల్ట్‌లు ధరిస్తారన్న విషయం తెలిసిందే.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమౌతుంది?
కారు వెనుక కూర్చున్న వారు సీటు బెల్ట్ ధరించకపోతే ఏమవుతుందనే దాని గురించి తెలిపే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెనుక సీట్లో ఉన్న ఇద్దరిలో ఒకరు మాత్రమే సీటు బెల్ట్ ధరించారు. ప్రమాదం జరిగినప్పడు సీటు బెల్ట్ పెట్టుకోని వ్యక్తి ఎగిరి ముందు సీటులోని వ్యక్తి ఎగిరిపడిపోయినట్టుగా వీడియో చూపించారు. బాహుశా మిస్త్రీ కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈవిధంగానే జరిగివుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కారులో ప్రయాణించే వారంతా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెబుతున్నారు. (క్లిక్: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..!)
చట్టం ఏం చెబుతోంది?
సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) ప్రకారం వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీఎంవీఆర్ రూల్ 138 (3) ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు.. ముందు సీటులో కూర్చున్న వారితో పాటు వెనుక సీటులో ఉన్న వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తారు. కాగా, కారులో అన్ని సీట్లకు Y- ఆకారపు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలని ఈ సంవత్సరం ప్రారంభంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
25 శాతం మరణాలను నివారించొచ్చు
వెనుక సీటు బెల్ట్‌లను ఉపయోగించడం వల్ల 25 శాతం మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అంతేకాదు ప్రమాదాల్లో ముందు సీటు ప్రయాణికులకు అదనపు గాయాలు లేదా మరణాన్ని కూడా నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment