ఆ సిక్కు నటుడికి ఎయిర్ లైన్స్ క్షమాపణ
న్యూయార్క్: ఎయిర్ పోర్టులో అవమానానికి గురైన సిక్కు నటుడు, డిజైనర్ అయిన ఇండో-అమెరికన్ వారిస్ అహ్లువాలియాకు ఎరోమెక్సికో క్షమాపణలు చెప్పింది. రెండు రోజుల క్రితం మెక్సికో ఎయిర్ పోర్టులో తలపాగా విప్పని కారణంగా సిక్కు నటుడిని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. ఈ విషయమై అతనికి కలిగిన అసౌకర్యానికి ఆ అధికారులు విచారం వ్యక్తం చేస్తూ క్షమించమని కోరారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలన్న దానిపై కాస్త స్పష్టత తీసుకొచ్చారు. ప్రయాణికుల మత విశ్వాసాలను గౌరవించాలని, అన్ని మతాల వారిని ఒకేతీరుగా చూడాలని ఎరో మెక్సికో అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెక్యూరిటీ అంశాలపై జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రయాణికులను అగౌరవపరచరాదని సిబ్బందికి సూచించింది.
న్యూయార్క్ కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. తమ సాంప్రదాయంలో భాగమైన తలపాగాను తొలగించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు అహ్లువాలియా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అతడిని విమానం నుంచి దింపేశారు. మెక్సికో కస్టమర్ సర్వీస్ డెస్క్ ముందు తన బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని చూపిస్తూ ఓ ఫొటో దిగి మంగళవారం పోస్ట్ చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో కచ్చితంగా పాల్గొనాలని, తాను లేకపోతే షో మొదలవ్వదని వివరించినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా ఎరోమెక్సికో ప్రయాణికులతో ప్రవర్తించాల్సిన అంశాలపై కొన్ని ప్రకటనలు జారీచేస్తూ నటుడు వారిస్ అహ్లువాలియాకు క్షమాపణలు తెలిపారు.