ఇండోనేసియాలోని బాండ యూనివర్సిటీలో చదువుతున్న తోటి విద్యార్థితో చనువుగా ఉన్నందుకు నూర్ ఎలితా అనే విద్యార్థినిని షరియా చట్టం ప్రకారం బహిరంగంగా శిక్ష విధించారు.
జకార్త: ఇండోనేసియాలోని బాండ యూనివర్సిటీలో చదువుతున్న తోటి విద్యార్థితో చనువుగా ఉన్నందుకు నూర్ ఎలితా అనే విద్యార్థినిని షరియా చట్టం ప్రకారం బహిరంగంగా శిక్ష విధించారు. బాండ అసేహ్ రాష్ట్ర రాజధాని నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటన మనసులను కలచివేస్తోంది. ఆ నగరంలోని బైతురాహుమిమ్ మసీదు వద్దకు నగర పోలీసులు.. ఆమెను ఈడ్చుకొచ్చి అక్కడున్న వేదికపై మోకాళ్లపై కూర్చోపెట్టారు. ఈ శిక్షను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అప్పటికే అక్కడ ఎంతోమంది నగర ప్రజలు గుమిగూడారు.
ఇంతలో ముఖం నిండా ముసుగు ధరించిన ఓ వ్యక్తి వేదిక మీదకు వెదురు కర్రతో వచ్చాడు. నూర్ ఎలితా వీపు మీద టపా.. టపా అంటూ ఐదుసార్లు బలంగా కర్రతో బాదారు. ఒక్కో దెబ్బకు కలిగే బాధను తట్టుకోలేక ఆమె విలవిలలాడుతుంటే గుమిగూడిన జనం మాత్రం కేరింతలు కొట్టారు. ఐదో దెబ్బకు ఆమె నేలకరుచుకున్నారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.
ఆ తర్వాత ఆమెతో చనువుగా ఉన్నందుకు ఆమె బాయ్ ఫ్రెండ్‌ను వేదిక మీదకు తీసుకొచ్చి సీన్ రిపీట్ చేశారు. నూర్ ఎలితాను బాదినట్టే చితక బాదారు. చుట్టూర ఉన్న జనం మళ్లీ అలాగే చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఆ తర్వాత జూదం ఆడారన్న ఆరోపణలతో ఓ నలుగురు కుర్రవాళ్లను అలాగే బాదారు. ఈ శిక్ష అమలును ప్రత్యక్షంగా వీక్షించేందుకు బాండ అసేహ్ డిప్యూటీ మేయర్ జైనల్ ఆరిఫిన్ హాజరయ్యారు.
అనంతరం ఆయన అక్కడ మూగిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ శిక్ష ప్రజలందరికి గుణపాఠం కావాలని అన్నారు. ఈ శిక్ష ఈరోజుతోనే ఆగిపోవాలని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నేరం చేయరని ఆశిస్తున్నానని చెప్పారు. షరియా చట్టం నిబంధనల ప్రకారం పెళ్లి కాకుండా స్త్రీ, పురుషులు ఎవరూ కూడా చనువుగా ఉండరాదు. జూదం జోలికి వెళ్లకూడదు. ఇండోనేసియాలో ఒక్క బాండ రాష్ట్రంలోనే షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. స్వతంత్ర ప్రతిపత్తిగల బాండలో ఈ చట్టాన్ని 2003లో ప్రవేశ పెట్టారు.