క్రమశిక్షణకు మారుపేరైన జపాన్‌లో రైల్వే వ్యవస్థనే ఒక బుల్లి కీటకం అస్తవ్యస్తం చేసేసింది. ఏకంగా 12 వేల మంది ప్రయాణికుల్ని ఇక్కట్లు పాల్జేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే దక్షిణ జపాన్‌లో జేఆర్ క్యాషూ కంపెనీ నడిపే రైల్వే లైన్లలో కొన్నింటికి హఠాత్తుగా మే 30న విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 26 రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఏకంగా 12 వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపించడంతో కంపెనీ సాంకేతిక బృందం హుటాహుటిన రంగంలోకి దిగింది. రైల్వే వ్యవస్థకు విద్యుత్ సరఫరా చేసే ఒక పరికరం పనిచెయ్యకపోవడంతో ఈ ఘోరం జరిగిందని వారికి అర్థమైంది. ఇంతకీ ఎందుకు పని చెయ్యడం లేదని ఆ పరికరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక చిన్న పురుగు కారణమని తేలింది.
ఎలా వెళ్లిందో ఏమో మరి గొంగళి పురుగు మాదిరిగా ఉండే అతి చిన్న కీటకం ఆ విద్యుత్ సరఫరా చేసే పరికరంలోకి దూరింది.. దీంతో ఆ పురుగు షాక్ కొట్టి చనిపోవడమే కాదు, షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసింది. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి రైళ్లు రద్దవడంతో గందరగోళం నెలకొంది. మన దేశంలో రైలు ప్రయాణం అంటే జీవిత కాలం లేటు కానీ, జపాన్‌లో రవాణా వ్యవస్థ ఎంత క్రమ శిక్షణతో ఉంటుందంటే అక్కడ రైలు వచ్చిన టైమింగ్‌తో మన గడియారాలను సరిచేసుకోవచ్చునన్నమాట. అందుకే అంత కలకలం రేగింది. జపాన్‌లో ఇలాంటి తరహా ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని జేఆర్ క్యాషూ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment