ఎవరైనా అద్దం ముందు నిలబడితే వారి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అలా చూపించకపోతే దాన్ని అద్దమే అనం కదా! కానీ మన ప్రతిబింబాన్ని చూపించకపోయినా ఒక్కోసారి అద్దం అనాల్సి ఉంటుంది. ఈ విషయానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఫొటోలో కనిపిస్తున్న అద్దం. దీని ఎదురుగా మామూలు స్థితిలో నిలబడితే మన ముఖాన్ని చూపించదు. మన ప్రతిబింబాన్ని చూడాలంటే మాత్రం మనం చిన్న చిరునవ్వును ఇవ్వాలి.
స్మైల్ ఇస్తేనే ఈ అద్దం మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. దీన్ని కేన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారుచేశారు. ఇదొక హైటెక్ మిర్రర్. ఇందులో ఒక కెమెరా ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో ఈ అద్దం పనిచేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని మన ముఖ కవళికలను ఈ అద్దం గుర్తిస్తుంది. మనం నవ్వులు చిందించినప్పుడు కెమెరా సహాయంతో మన ముఖాన్ని గుర్తించి సదరు వ్యక్తి ప్రతిబింబం దర్శనమిస్తుంది.
దీన్ని గోడకు, టేబుల్ మీద ఎక్కడైనా ఉంచి సాధారణ అద్దం తరహాలో ఉపయోగించవచ్చు. ప్రస్తుతం దీని ధర 2,000–3,000 డాలర్ల మధ్య ఉంది. దీన్ని టర్కీస్ ఇండస్ట్రియల్ డిజైనర్ బెర్క్ ఇల్హాన్ రూపొందించారు. బెర్క్ ఇంట్లో ఒకరికి కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో నవ్వులు దూరమయ్యాయి. ఎలాగైనా ఆ ఇంట్లో నవ్వులు పూయించాలనుకున్న ఇల్హాన్ రెండేళ్లు కష్టపడి ఈ హైటెక్ మిర్రర్‌ను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment