మంచు దెబ్బకు 2,600 విమాన సర్వీసులు రద్దు
తూర్పు అమెరికా దేశాలపై మంచు మహమ్మారి విరుచుకుపడింది. అక్కడి దేశాలు గజగజ వణికిపోతున్నాయి. నివాస ప్రాంతాలు, రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పాఠశాల భవనాలు, వ్యాపార సముదాయాలు, చెట్లు ఇలా ఒక్కటేమిటి.. పలు ప్రదేశాలు మంచుదుప్పటి పరుచుకుని కనిపించకుండా పోయాయి. దీని ప్రభావంతో ఏకంగా వాషింగ్టన్లోని పలు కార్యాలయాలు మంగళవారం మూతపడ్డాయి. దాదాపు 2,600 అమెరికా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు రహదారులు మూసేసి సెలవులు ప్రకటించారు. ముస్సోరి, అర్కనాస్, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, కెంటకీ, ఇండియానా, ఓహియో వంటి ప్రాంతాల్లో పెద్దమొత్తంలో మంచు కురుస్తుండటంతో పాటు, పెద్ద పెద్ద మంచుగడ్డలు పడుతున్నాయి.
ఇది తూర్పు ప్రాంతాలతో పాటు దక్షిణ ప్రాంతాలను కూడా తుడిచిపెట్టేసేంత శక్తిమంతంగా ఉందని అధికారులు అంటున్నారు. గతంలో వచ్చిన మంచుతుఫాన్ల తీవ్రత రికార్డులను ఇది బ్రేక్ చేసినట్లు తెలిపారు. ఉత్తర కరోలినా, వర్జీనియా, మిస్సిసిప్పీ, జార్జియా, కెంటకీ అధికార యంత్రాంగాలు అత్యవసర పరిస్థితులను ప్రకటించాయి. పర్యాటక ప్రాంతాలన్నీ బోసిపోయాయి. ఎవ్వరూ ఇళ్లను వదిలి బయటకు రావొద్దని, పాఠశాలలను తెరవొద్దని ఆయా ప్రాంతాల గవర్నర్లు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశారు. బుధవారం వరకు మంచు ఇలా పడుతూనే ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. రోడ్లన్నీ జారిపోతున్న కారణంగా సోమవారం ఓ వ్యాన్ - స్కూల్ బస్సు ఢీకొని 13 మంది విద్యార్థులు గాయపడినట్లు పెన్సిల్వానియా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 25 సెంటీమీటర్ల మంచు తుఫాను కుండపోతగా పడుతున్నదన్నారు. దాదాపు 50 మిలియన్ల అమెరికా పౌరులు దీని బారిన పడినట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు తెలిసింది. వచ్చే గురువారం లేదా శుక్రవారంలో మరో మంచు మహమ్మారి విరుచుకు పడే అవకాశం ఉందని హర్లీ అనే అమెరికన్ అధికారి చెప్పారు.