ఫేస్‌బుక్ రహస్యాలు లీక్..!
న్యూయార్క్: సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్ ఇక నుంచి యాడ్స్ (ప్రకటనలు)ను ప్రారంభించనుంది. ఫేస్బుక్ కు చెందిన చాటింగ్ యాప్ మెసెంజర్‌లో యాడ్స్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇందుకు మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ కు చెందిన కొన్ని కీలక డాక్యుమెంట్లు తాజాగా మార్కెట్లోకి లీకయ్యాయి. దీంతో కంపెనీ రహస్యాలు వెల్లడయ్యాయని ఫేస్ బుక్ ఆందోళన చెందుతోంది. కీలకపత్రాలు ఎలా లీక్ అయ్యాయని ఆరాతీయడం మొదలెట్టింది. అలా లీకైన డాక్యుమెంట్ల ద్వారానే.. ఫేస్బుక్ యాడ్స్ కు ఓకే చెప్పనుందున్న వార్త ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తోంది.
కీలక పత్రాల్లో ఫేస్బుక్ సంస్థ యాడ్స్ కోసం 'ఎఫ్బీ.కామ్/ఎమ్ఎస్జీ/'ని రూపొందించినట్లు వెల్లడైంది. ప్రస్తుతానికి ఈ లింక్‌పై ఏ పేజీ కనిపించడం లేదు. 2016 రెండో త్రైమాసికంలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వదంతులపై స్పందించడానికి ఫేస్బుక్ సిద్ధంగా లేదని ఓ అధికారి తెలిపారు. మెసెంజర్‌తో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూనే 80 కోట్ల తమ యూజర్లకు కొన్ని కొత్త సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నట్లు ఫేస్బుక్ సైట్లో పేర్కొన్నారు. యాడ్స్ కోసం తమను సంప్రదించేవారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తారని, సాధారణ యూజర్స్‌కు వీటి వల్ల ఏమాత్రం ఇబ్బందులు తలెత్తవని డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది.