నార్త్‌ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి! | South Korea And US Urges North Korea Abide By Peace Agreement | Sakshi
Sakshi News home page

‘నార్త్‌ కొరియా శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలి’

Published Thu, Jun 25 2020 3:15 PM | Last Updated on Thu, Jun 25 2020 3:26 PM

South Korea And US Urges North Korea Abide By Peace Agreement - Sakshi

దక్షిణ కొరియా రక్షణ మంత్రి జియోంగ్‌ కియోంగ్‌-డూ

సియోల్‌: ఉత్తర కొరియా 2018 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని దక్షిణ కొరియా, అమెరికా గురువారం విజ్ఞప్తి చేశాయి. తద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నాయి. కొరియా యుద్ధం(జూన్‌ 25, 1950) మొదలై నేటికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా, దక్షిణ కొరియా.. తమ దేశ రక్షణ మంత్రులు మార్క్‌ ఎస్సర్‌, జియోంగ్‌ కియోంగ్‌-డూ పేరిట సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అమెరికా- ఉత్తర కొరియాల మధ్య సింగపూర్‌లో కుదిరిన ఒప్పందంపై సంతకం చేసిన నార్త్‌ కొరియా దానికి కట్టుబడి ఉండాలని కోరాయి. అదే విధంగా తమ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ.. బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని పేర్కొన్నాయి.

కాగా అనేక సవాళ్లు- పరిణామాల అనంతరం 2018, జూన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, నార్త్‌ కొరియా సుప్రీంలీడర్‌ కిమ్‌ జోంగ్‌‌ ఉన్‌‌ల మధ్య సింగపూర్‌లో చారిత్రాత్మక భేటీ జరిగిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంతో పాటు అణు నిరాయుధీకరణ కోసం ఇరుదేశాలు శత్రుత్వం నుంచి బయటకు వచ్చి పరస్పర అవగాహనతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు కిమ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ఇద్దరు భేటీ అయ్యారు.(అమెరికా తీరుపై ఉత్తర కొరియా అసహనం!)

ఉత్తర కొరియా హెచ్చరికలు
గత కొన్ని రోజులుగా దక్షిణ కొరియాపై ఉ. కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయ కొరియాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని హెచ్చరిస్తోంది. అదే విధంగా..  సింగపూర్‌ భేటీకి రెండేళ్లు పూర్తైన సందర్భంగా.. అమెరికా విధానాలు తమకు హాని చేసేవిగా ఉన్న కారణంగా ఆ దేశంతో బంధం కొనసాగించడంపై పునరాలోచన చేసే అవకాశం ఉందని ఉత్తర కొరియా పేర్కొంది.

అంతేగాక అమెరికా అధ్యక్ష ఎన్నికలు సాఫీగా జరగాలంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తమ ప్రజలకు వాషింగ్టన్‌తో దీర్ఘకాలిక ముప్పు పొంచి ఉన్నందున.. వారికి దీటుగా బదులిచ్చేందుకు తమ సైనిక వ్యవస్థను మరింత పటిష్ట పరచుకునేందుకు సిద్ధమైనట్లు విదేశాంగ మంత్రి రీ సర్‌ గ్వాన్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాంతిని ఆకాంక్షిస్తూ అమెరికా- దక్షిణ కొరియా ప్రకటన విడుదల చేయడం విశేషం. (సోదరి ఆదేశాలు.. సైనిక చర్య వద్దన్న కిమ్‌!)

కొరియన్‌ యుద్ధం..
ఇక 1950-53 మధ్య జరిగిన కొరియన్‌ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. దాదాపు 1,35,000 ఉత్తర కొరియా బలగాలు దక్షిణ కొరియాపై దండెత్తాయి. ఆ సమయంలో అమెరికా సహా 16 దేశాలు ద. కొరియాకు అండగా నిలవగా.. చైనా ఉ. కొరియాకు మద్దతునిచ్చింది. అనేక పరిణామాల అనంతరం జూలై 27, 1953 ఘర్షణ తొలగిపోయినప్పటికీ అధికారికంగా యుద్ధం ముగిసినట్లు మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో 2018లో ద. కొరియా అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్‌, ఉ. కొరియా సుప్రీంలీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో చర్చలకు సిద్ధమయ్యారు. మూడు దఫాలుగా సమావేశమై ఒప్పందం(కాల్పుల విరమణ) కుదుర్చుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(దక్షిణ కొరియాకు కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement