పుచ్చకాయలకు ప్రత్యేకంగా..
మ్యూజియం అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎగిరి గంతేస్తారు. అక్కడికెళితే చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు అని తెగ సంబరపడి పోతుంటారు. అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల మ్యూజియాలు చూసి ఉంటారు. చైనాలోని బీజింగ్‌లో ఉన్న ఓ వినూత్నమైన మ్యూజియాన్ని మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే అది అలాంటి ఇలాంటిది కాదు.. పుచ్చకాయల కోసమే ఏర్పాటు చేసిన ప్రపంచంలోని ఏకైక మ్యూజియం.
దాదాపు 43 వేల చదరపు అడుగులు ఉండే ఈ మ్యూజియంలో పుచ్చకాయల పుట్టుపూర్వోత్తరాలు, పుస్తకాలు, ఫొటోలు, కామిక్స్ వంటివి అక్కడ ఉంటాయి. అంతేకాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో లభించే వివిధ ఆకారాల్లోని పుచ్చకాయలను చూడొచ్చు. అయితే అవన్నీ నిజమైనవి కావు.. మైనంతో తయారు చేసినవే ప్రదర్శనకు ఉంచారు. ఆఖరికి మ్యూజియంను కూడా పుచ్చకాయ ఆకారంలోనే నిర్మించారు.