పోప్‌పై గూఢచర్యం.. రహస్యాలపై రెండు బుక్స్
వాటికన్‌సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత సంభాషణలు వెలుగుచూడటం.. క్యాథలిక్ చర్చ్ వర్గాలను కుదిపేస్తున్నది. పోప్ ఫ్రాన్సిస్‌పై గూఢచర్యం జరిపిన ఓ స్పానిష్ క్రైస్తవ మతగురువు, మరో వ్యక్తి.. ఆయన వ్యక్తిగత సంభాషణలకు సంబంధించిన వైర్ టేప్‌లను బయటపెట్టారు. ఇప్పటికే వాటికన్ చర్చ్‌కు సంబంధించిన కీలక రహస్య సమాచారం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు చేరడం కలకలం సృష్టిస్తున్నది. ఈ రహస్య సమాచారంలో చర్చ్ నిధులను కొల్లగొట్టడం, వేశ్యలోలత్వం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రచించిన రెండు పుస్తకాలు బుధవారం విడుదల కానున్నాయి. స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు సంబంధించిన నిధులను క్రైస్తవ మతగురువులైన కార్డినల్స్ నివాసాలకు అదనపు హంగులు చేకూర్చేందుకు దుర్వినియోగం చేశారని, అక్రమాలకు నెలవైన వాటికన్ బ్యాంకు నేరగాళ్లకు అడ్డగా మారిందని ఈ పుస్తకాలు ఆరోపిస్తున్నాయి.
చర్చ్‌కు సంబంధించిన వర్గీకరించిన పత్రాలను దొంగలించి లీక్ చేశారనే ఆరోపణలపై ప్రజాసంబంధాల నిపుణుడు ఫ్రాన్సెస్కా చావ్కీ, మొన్సీగ్నర్ లుసియో ఎంజెల్ వాలెజో బాల్డా గతవారం అరెస్టయ్యారు. అయితే ఈ ఇద్దరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు గియన్‌లుయిజి నూజి, ఎమిలియనో ఫిట్టిపాల్దికి రహస్య సమాచారం చేరవేశారా? అన్న విషయాన్ని వాటికన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రాసిన పుస్తకాలను మాత్రం తీవ్రంగా ఖండించింది.