
'ఉగ్రవాద కార్యకలాపాలపై విశ్వాసం లేదు'
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాల్ని బాధ్యులుగా చేయాలి
ఐక్యరాజ్యసమితిలో భారత్ డిమాండ్
అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి భారత్ పిలుపు
యూఎన్: ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల్నే బాధ్యులుగా చేయాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ డిమాండ్ చేసింది. ఇందుకు గాను అంతర్జాతీయ ఉగ్రవాదంపై దేశాల మధ్య సమగ్ర ఒప్పందానికి భారత్ పిలుపునిచ్చింది. శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో జరిగిన గ్లోబల్ కౌంటర్ టైజమ్ స్ట్రేటజీస్ అంశంపై ఐదో సమీక్ష సదస్సులో ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కారణాలతో గానీ, న్యాయం పేరుతో గానీ జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై భారత్‌కు ఎంతమాత్రమూ విశ్వాసం లేదని.. ఎటువంటి ఉగ్రకార్యకలాపాలను తమ దేశం ఉపేక్షించబోదని ఆయన అన్నారు. ఉగ్రదాడులు ఏ ఒక్కదేశానికో పరిమితం కాలేదని అంతర్జాతీయ ఉగ్రవాదాన్నిఅన్ని దేశాలు కలసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు. ఉగ్రదాడుల బాధితులు ఏ ఒక్కదేశానికో లేదా ఏ ఒక్క జాతికో, మతానికో మాత్రమే పరిమితమైన వారు కాదని ఆయన అన్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాదంపై మరింత వేగవంతంగా, సమష్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి తమ దేశం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. దురదృష్టవశాత్తూ అది ఇప్పటికీ చట్టబద్దతను కల్పించుకోలేకపోయిందన్నారు. ఇప్పటికైనా ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, ఉగ్రవాద సంస్థలను పెంచిపోషించడం వంటి చర్యలను అరికట్టాలని అన్ని దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
ఐక్యరాజ్య సమితిలో బంగ్లాదేశ్ ప్రతినిధి మసూద్ బిన్ మొమెన్ తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఉగ్రదాడిఘటనకు సంబంధించి మాట్లాడుతూ... తమ దేశం ఉగ్రవాదంపై నిరంతర పోరును కొనసాగిస్తుందని, యువతను ఉగ్రవాదం వైపు మళ్లకుండా వివిధ మతాల పెద్దలు, విద్యావేత్తలు, పౌర సమాజంతో కలసి పనిచేస్తామన్నారు.