బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి...
36 మంది మృతి... 56 మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 36 మంది మృతి చెందగా, 56 మంది గాయాల పాలయ్యారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉంగే సద్దర్ పట్టణం కూడలి గల ఓ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి భారీగా పేలుడు పదార్థాలతో కూడిన కారుతో సహా తనని తాను పేల్చుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే ఉన్నట్లు తెలిపారు.
బాగ్దాద్‌కు ఈశాన్యన ఉన్న ఈ ప్రాంతాల్లో ఎక్కువగా షియాలు నివసిస్తుంటారని, గత కొంతకాలంగా ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడికి కారణం ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాగా, ఇది ఉగ్రవాదుల దాడిగా అధికారులు భావిస్తున్నారు. గత మూడు రోజుల్లో బాగ్దాద్‌లో ఇది రెండో భారీ దాడి. బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో శనివారం జరిగిన దాడిలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.