మాన్‌హట్టన్ పేలుడు ఘటనలో పోలీసులకు చిక్కిన ఈ వ్యక్తినే సూసైడ్ బాంబర్‌గా అనుమానిస్తున్నారు.
న్యూయార్క్ : మాన్‌హట్టన్ పేలుడు ఘటనపై అనేక కథనాలు వెలుగులోకి వస్తుండటం అమెరికాను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలో మునిగిపోయిన అమెరికాకు ఇదే అదనుగా షాక్ ఇవ్వాలని ఉగ్రవాదులు భావించారా? తమ స్లీపర్‌సెల్స్‌ను నిద్రలేపి ఒంటరి తోడేలు(లోన్ ఊల్ఫ్) దాడులకు ఉసిగొల్పారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
పైప్ బాబు పేలి ఉంటే ఘోరవిషాదం చూసేవాళ్లం!
న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్ 42వ వీధి, 8వ అవెన్యూలో గల పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ వద్ద పేలుడు జరిగిన కొద్దిసేపటికి.. గాయపడిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గరున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌తో అతను..శక్తిమంతమైన పైప్ బాంబులను పేల్చేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిసింది. బాంబును సరిగా పేల్చడంలో అతను విఫలమయ్యాడు. ఒక వేళ బాంబు సరిగా పేలి ఉంటే ఈ పాటికి మనం ఘోరవిషాదాన్ని చూసేవాళ్లం’ అని పోలీస్ వర్గాలు తెలిపాయని సీఎన్‌ఎన్ వార్త సంస్థ పేర్కొంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
నలుగురికి గాయాలు..
మాన్‌హట్టన్ పేలుడు ఘటనలో మొత్తం నలుగురు గాయపడ్డట్లు ఎన్‌వైపీడీ తెలిపింది. ఆ గాయాలేవీ ప్రాణాంతకమైనవి కావని, అరెస్టైన వ్యక్తి కూడా ఆ నలుగురిలో ఒకరని పేర్కొంది.
పొద్దుపొద్దున్నే పేలుడు
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలో సోమవారం ఉదయం ఉదయం 7:45 గంటలకు పేలుడు సంభవించింది. 42వ వీధి, ఎనిమిదో అవెన్యూలోని పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్‌ను పేలుడు కేంద్రంగా పోలీసులు గుర్తించారు. పేలుడు అనంతరం పోర్ట్ బస్ టెర్మినల్‌లోని ఏ, సీ, ఈ లైన్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment