సింగపూర్: సెన్సార్ల తయారీలో కొత్త టెక్నాలజీని సింగపూర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. నూతన టెక్నాలజీ ద్వారా 'సూపర్ సెన్సిటీవ్ మ్యాగ్నటిక్ సెన్సార్'లను తయారు చేసినట్లు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటివరకు వాడుతున్న సెన్సార్ల కంటే 200 రెట్లు సున్నితత్వం గల సూపర్ సెన్సార్లు ఎంతో ప్రభావవంతంగా పనిచేయనున్నట్లు తెలిపారు. కొత్త సాంకేతికతతో పరిమాణంలో చిన్నవిగా, తక్కువ ఖర్చులో సెన్సార్లు తయారు చేయడానికి వీలవుతుంది.
ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక, బయోటెక్నాలజీ రంగంలో విరివిగా ఉపయోగించే సెన్సార్లలో ఇప్పటివరకు సిలికాన్, ఇండియమ్ యాంటీమోనైడ్ అనే పదార్థాలను ఉపయోగిస్తుండగా సూపర్ మ్యాగ్నటిక్ సెన్సార్లలో గ్రాఫిన్, బోరాన్ నైట్రైడ్లను వాడారు. కొత్త సెన్సార్ల తయారీతో వినియోగ వ్యాపార రంగంలో కీలకమైన ముందడుగు పడిందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కలోన్ గోపీనాథన్ తెలిపారు.