నారా..గుర్తు చేసుకుంటారా! | - | Sakshi
Sakshi News home page

నారా..గుర్తు చేసుకుంటారా!

Published Fri, Jul 21 2023 2:00 AM | Last Updated on Fri, Jul 21 2023 11:12 AM

- - Sakshi

సింగపూర్‌ తరహా ఇళ్లు.. పేపర్‌ పరిశ్రమ.. వేలాది మందికి ఉద్యోగాలు... ఇదీ నాడు నారా లోకేష్‌ మార్కాపురం వాసులకు ఇచ్చిన ఘనమైన హామీలు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉండి ఒకే ఒక్కసారి జిల్లాకు వచ్చారు. మార్కాపురానికి వచ్చి సింగపూర్‌ టెక్నాలజీతో అద్భుతమైన సింగిల్‌, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇస్తాం.. పేపర్‌ పరిశ్రమ ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలిస్తాం.. అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు.

ఇవి ఉత్తుత్తి ప్రకటనలుగానే మిగిలిపోయాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన మార్కాపురం నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నాడు ఆయన ఇచ్చిన హామీలను నియోజకవర్గ వాసులు గుర్తుచేసుకుంటూ నాడు ఇంతన్నాడు..అంతన్నాడు..అనుకుంటూ ఎద్దేవా చేస్తున్నారు.

మార్కాపురం టౌన్‌: అది నవంబర్‌ 29వ తేదీ 2018వ సంవత్సరం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా ఉన్న నారా లోకేష్‌ మార్కాపురం పట్టణానికి వచ్చారు. రూ.333 కోట్ల వ్యయంతో 4,620 మంది పేదలకు సింగిల్‌, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. మార్కాపురం నుంచి నాగులవరానికి వెళ్లే దారిలో వీటిని నిర్మిస్తామంటూ ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు.

బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సింగపూర్‌ టెక్నాలజీతో తెలంగాణలో కేసీఆర్‌ నిర్మిస్తున్న ఇళ్లకంటే గొప్పగా నిర్మిస్తామన్నారు. అంతేకాదండోయ్‌ షాపూజీ, పల్లంజీ కంపెనీలతో వీటిని నిర్మిస్తున్నామని కూడా ప్రకటించారు. అయితే, ఇక్కడ నిర్మించేది కేవలం 3,600 ఇళ్లు మాత్రమేనని, ఇందుకు తొలి విడతగా రూ.50.16 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి 912 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు.

పేదల కలను సాకారం చేస్తున్న సీఎం జగన్‌...
నాడు లోకేష్‌ ఉత్తుత్తి హామీలిస్తే నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజల కలలను సాకారం చేస్తున్నారు. మార్కాపురం పట్టణ శివారులో 7 వేల ఇళ్లు మంజూరు చేశారు. ఇడుపూరు వద్ద రెండు లే అవుట్లలో వేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక లోకేష్‌ శంకుస్థాపన చేసి వదిలేసిన టిడ్కో గృహ నిర్మాణాల ప్రాంతంలో 492 గృహాలకు స్లాబ్‌లు వేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. రూ.11.76 కోట్లు చెల్లించారు. ఒక్క రూపాయి చెల్లించడం ద్వారా మంచి ఇంటిని ప్రభుత్వమే కట్టించి ఇస్తోంది. మౌలిక వసతులైన రోడ్లు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఇక జగనన్న కాలనీలైతే కొత్త గ్రామాలుగా తయారవుతున్నాయి. అక్కడ కొంత మంది గృహ ప్రవేశాలు కూడా చేశారు.

నారా లోకేష్‌ మార్కాపురం సభలో ఇంకో ఘనమైన హామీ కూడా ఇచ్చారు. మార్కాపురం వద్ద పేపర్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్‌ 5వ తేదీ 2018వ సంవత్సరంలో రూ.20 వేల కోట్లతో సినార్మస్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నామని ప్రకటించారు. దీని ద్వారా జిల్లాలో 20 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపారు. అయితే, కాగితం పరిశ్రమ కాగితాలకే పరిమితమైంది. ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన నిరుద్యోగులకు అడియాసే మిగిలింది. వీటితో పాటు కోల్డ్‌స్టోరేజీ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

అది కూడా అంతే. జిల్లాలో విస్తారంగా సుబాబుల్‌ సాగుచేస్తున్నారు. కాగితం పరిశ్రమ లేకపోవడంతో సుబాబుల్‌ కర్ర మొత్తం భద్రాచలం పేపర్‌ మిల్లులకు వెళ్లిపోతోంది. ఇక్కడే పేపర్‌ పరిశ్రమ ప్రారంభించి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్‌ ఇచ్చిన హామీ నెరవేరలేదు. దీంతోపాటు మార్కాపురంలో కోల్డ్‌ స్టోరేజీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. అప్పట్లో మార్కాపురం టీడీపీ నాయకులు పట్టణంలోని దోర్నాల సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని లోకేష్‌తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, తాత విగ్రహం వైపు లోకేష్‌ కన్నెత్తి కూడా చూడలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement