సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పాదయాత్రలంటే .. జనంతో మమేకమవుతూ..సమస్యలు వింటూ...గ్రామాల్లో పరిస్థితులు గమనిస్తూ, నిరుపేదలు, మహిళలు ఇలా అన్ని వర్గాల కష్టాలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగాలి. గతంలో దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డిల పాదయాత్రలు ప్రజా సమస్యలను తెలుసుకోవడమే ధ్యేయంగా సాగిన విషయం తెలిసిందే. లోకేష్ పాదయాత్ర మాత్రం అందుకు భిన్నంగా ‘‘ఈవినింగ్ వాక్’’లా సాగుతోంది. రాత్రి బస కేంద్రంలోకి వెళితే మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు టెంట్‌కే పరిమితమవుతున్న పరిస్థితి. సాయంత్రం 4 గంటలకు బయటకు వచ్చి కొద్దిసేపు సెల్ఫీలు దిగి రోడ్డుపైకి వచ్చి రాగానే మీటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు.
ఈ హడావుడిలో ఎవరైనా సమస్యలు చెప్పుకుందామని మహిళలు, వృద్ధులు దగ్గరకు రావాలని చూస్తే లోకేష్ ప్రైవేటు సైన్యం వారిని ఈడ్చి పడేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ బుధవారం ఒంగోలులో జరిగిన లోకేష్ పాదయాత్రలో చోటు చేసుకుంది. మహిళలను లోకేష్ ప్రైవేటు సైన్యం ఎత్తివేయడంతో కింద పడ్డారు. వారికి ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్డు జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభ సాక్షిగా లోకేష్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మహిళలు, వృద్ధులను దగ్గరకు తీసుకుని, వారి కష్టాలు తెలుసుకుంటూ పాదయాత్ర చేయాల్సింది పోయి బాణాసంచా పేలుస్తూ, డప్పులు కొట్టుకుంటూ హంగామా చేస్తుండడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. లోకేష్ ప్రైవేటు సైన్యం పరిస్థితి ఎలా ఉందంటే, ఏమైనా గొడవలు జరుగుతాయేమోనని ముందు జాగ్రత్తగా ఫొటోలు తీస్తున్న పోలీసుల ఫోన్లు సైతం లాగేసుకుని వారిపై దౌర్జాన్యానికి దిగుతున్నారు.
లోకేష్ పాదయాత్ర వీడియో తీస్తున్న ఓ స్పెషల్‌బ్రాంచ్ కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌ను లోకేష్ ప్రైవేటు సైన్యం లాక్కొని తిరిగి ఇవ్వకపోడంతో అడిషనల్ ఎస్పీ స్థాయి ద్వారా చెప్పించి ఫోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న తీరుపై ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. అధికారం లేకపోతేనే వీరి పరిస్థితి ఇలా ఉంటే, ఇక అధికారంలోకి వచ్చాక మన సమస్య లు ఏం పట్టించుకుంటారంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.
జిల్లాలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి 250 మంది పోలీసు సిబ్బంది భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినా, లోకేష్ ప్రైవేటు సైన్యంతో హంగామా సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు. పోలీసులపై తన సొంత సైన్యం దౌర్జన్యానికి దిగుతున్నా పట్టించుకోని ఆయన సమావేశంలో మాత్రం వారిపై ప్రేమ ఒలకబోస్తూ తాము అధికారంలోకి వస్తే పోలీసుల సమస్యలు పరిష్కరిస్తానంటూ మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నోరు తెరిస్తే అబద్ధాలు... అభూత కల్పనలే....
లోకేష్ పాదయాత్రలో వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు..అభూత కల్పన ప్రసంగాలతో అభాసుపాలవుతున్నారు. మంగళవారం సంతనూతలపాడు నియోజకవర్గంలో వాహనాల మెకానిక్‌లతో జరిగిన ముఖాముఖిలో తాను 8వ తరగతిలో బైక్ ఇంజన్‌తో కారు తయారు చేసి తిప్పానంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అదే నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఇటీవల ఒంగోలులో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఎస్టీ యువకుడు మోటా నవీన్‌పై రామాంజనేయ చౌదరితోపాటు, మరికొందరు దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు, ముఖంపైన మూత్రం పోసిన వైనంపై పోలీసులు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి రామాంజనేయ చౌదరితోపాటు, ఎనిమిది మందిని ఈనెల 22వ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపారు. సోమవారం సంతనూతలపాడు సభలో ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను చదివిన లోకేష్, ఆ సంఘటనలో నిందితులను ఇంత వరకు అరెస్టు చేయలేదంటూ మాట్లాడటంపై అందరూ అవాక్కయ్యారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాతోపాటు, ఒంగోలు నగరంలో టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు పూర్తి చేశామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.
అధికారిక సమాచారం ప్రకారం టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు 30 శాతం కూడా పూర్తి చేయని పరిస్థితి. అందులోనూ బకాయిలు చెల్లించకుండా వదిలేసి ప్రస్తుత ప్రభుత్వంపై భారం మోపి వెళ్లిన పరిస్థితి అందరికి తెలిసిందే. ఈవిషయం తెలుసుకోకుండా టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతూ ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడటంపై రాజకీయ విశ్లేషకులు, ప్రజలు మండి పడుతున్నారు. పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువవడంతో డబ్బులిచ్చి జనాలను తరలించారు.
దామచర్లకు శృంగభంగం...
లోకేష్ వద్ద మార్కులు కొట్టేసేందుకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కాబోయే సీఎం లోకేష్ అంటూ తన అనుచరులతో నినాదాలు చేయించారు. దీంతో దామచర్ల దగ్గర ఉన్న మైకును తీసుకుని చివరకు టీడీపీలో నాకు ఏ పదవీ లేకుండా చేసేలా ఉన్నావంటూ లోకేష్ సైటెర్ వేసి ఝలక్ ఇచ్చారు. అంతే కాకుండా లోకేష్ ప్రసంగిస్తున్న సమయంలో డీజే..డీజే అంటూ అనుచరులతో నినాదాలు చేయించినా లోకేష్ పట్టించుకోలేదు. కొండపిలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని మళ్లీ గెలిపించాలంటూ అతని చేయి పైకెత్తి చెప్పిన లోకేష్ ఒంగోలులో మాత్రం దామచర్లను గెలిపించండి అని చెప్పకుండా ఈ సారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరాలి అని మాత్రమే చెప్పటంతో ఆయన వర్గం నిరాశకు గురయ్యారు. ఒంగోలు ప్రజలు సైతం ఈ సారి దామచర్లకు టిక్కెట్ డౌటే అని మాట్లాడుకోవటం కనిపించింది. లోకేష్ పాదయాత్ర షెడ్యూల్‌లో మొదట ఒంగోలు లేనప్పటికీ కోరిమరీ ఇక్కడకు పిలిపించుకున్నా ప్రయోజనం లేకపోయిందని దామచర్ల వర్గం తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment