అనుకున్నదొక్కటి..అయినదొక్కటి..బోల్తా కొట్టిందన్న చందంగా తయారైంది టీడీపీ నేత దామచర్ల జనార్దన్ పరిస్థితి. యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రను పట్టుబట్టి ఒంగోలు వచ్చేలా చేసి తన మైలేజ్ పెంచుకోవాలనుకున్నారు. అయితే సీన్ రివర్స్ అయింది. నగరంలో నిర్వహించిన సభలో లోకేష్ తన ప్రసంగంలో టీడీపీని గెలిపించండి అని పిలుపునిచ్చారే తప్ప జనార్దన్ ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో ఆయన, ఆయన అనుచరగణం నివ్వెరపోయింది. జనార్దన్ అభ్యర్థిత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యో జనార్దనా అంటూ పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం, రాజకీయనేతలు సైటెర్లు వేస్తున్నారు.
సాక్షిప్రతినిధి, ఒంగోలు: లోకేష్ యువగళం పాదయాత్ర ఒంగోలు టీడీపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్డు జంక్షన్‌లో నిర్వహించిన సభలో ఒంగోలు అభ్యర్థిత్వం విషయంలో లోకేష్ నర్మగర్భంగా మాట్లాడటమే ఇందుకు ప్రధాన కారణం. వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో టీడీపీ విజయం సాధించాలి..పసుపు జెండా ఎగరాలి అన్నారే తప్ప దామచర్ల జనార్దన్‌ను గెలిపించాలని చెప్పకపోవడం జిల్లా టీడీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ కేడర్‌లోనూ జనార్దన్ అభ్యర్థిత్వం విషయంలో అనుమానాలు రేకెత్తాయి. దీంతో 2024 ఎన్నికల్లో జనార్దన్‌కు టికెట్ లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
లోకేష్ యువగళం పాదయాత్రకు రూ.కోట్లు ఖర్చుచేసి ఒంగోలులో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తే.. లోకేష్ ప్రసంగంతో ఆయన పరిస్థితి గాలితీసిన బెలూన్‌లా తయారైందన్న ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. యువగళం కార్యక్రమం కోసం జనార్దన్ వసూలు చేశాడా? లేక సొంత డబ్బు ఖర్చు చేశాడా? అన్న విషయాన్ని పక్కన పెడితే లోకేష్ పాదయాత్రతో మైలేజ్ సాధించాలన్న ఆయన ప్లాన్ రివర్స్ అయింది. ఒక దశలో వేదిక కింద నుంచి జనార్దన్ అనుచరులు డీజే..డీజే..డీజే అని గావుకేకలు పెట్టినా లోకేష్ పట్టించుకోలేదు. దీంతో జనార్దన్ అనుచరులు కూడా నిరాశలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. జనార్దన్ పరువు లోకేష్ నిలువునా తీశాడన్న విమర్శలు సైతం గుప్పుమంటున్నాయి.
2014 నుంచి 2019 వరకు బాగా పనిచేశాడు, జనార్దన్ మంచి వాడు, కష్టపడ్డాడు అన్న లోకేష్.. ఒంగోలు అభ్యర్థి జనార్దనే అని అనకపోవడంతో జనార్దన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే కొండపిలో ప్రస్తుత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి చేతులను పైకెత్తి కొండపిలో స్వామిని గెలిపించండి.. మీకు అండగా ఉంటాడని స్వయంగా లోకేష్ ప్రకటించారు.
అదేవిధంగా కనిగిరిలో ప్రత్యక్ష్యంగా డాక్టర్ ఉగ్ర నరిసింహారెడ్డి అభ్యర్థి అని ప్రకటించకపోయినా పరోక్షంగా ఉగ్ర మీకు అండగా ఉంటాడు, వైఎస్సార్ సీపీ నాయకులను వదిలిపెట్టడు అని ప్రకటించారు. ఇక రెండో రోజు కూడా జయహో బీసీ సదస్సులోనైనా ఒంగోలు అభ్యర్థి జనార్దనే అని ప్రకటిస్తారేమోనని పార్టీ కేడర్ ఎదురు చూసింది. అసలు ఆ ప్రస్తావనే లేదు. దీంతో జనార్దన్ తలపట్టుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. తొలుత లోకేష్ యువగళం పాదయాత్ర ఒంగోలులో లేకపోయినా కావాలని తెచ్చుకున్నందుకు అపకీర్తి కొనక్కొచ్చుకున్నట్లు ఉందన్న భావన కూడా జనార్దన్ అభిమానుల్లో నెలకొంది.
కుటుంబ అంతర్గత కలహాలే కారణమా..?
దామచర్ల జనార్దన్ కుటుంబంలోని అంతర్గత కలహాలే దీనంతటికీ కారణమా అన్న ప్రచారం జోరందుకుంది. దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు రాజకీయ వారసుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. జనార్దన్ చిన్నాన్న కుమారుడు సత్యతో ఉన్న రాజకీయ వైరుధ్యం కారణమని అనుమానిస్తున్నారు. జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్న నాటి నుంచి సత్యకి జనార్దన్‌కు మధ్య రాజకీయంగా వివాదాలు పొడచూపిన విషయం అందరికీ తెలిసిందే.
వీరిద్దరి మధ్య గొడవలు పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు, లోకేష్ వద్దకు కూడా చేరాయి. ఇటీవల సత్య పార్టీ అధినేత చంద్రబాబుతో, లోకేష్‌తో సత్సంబంధాలు ఎక్కువగా నెరుపుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కారణంగానే జనార్దన్ అభ్యర్థిత్వాన్ని లోకేష్ ప్రకటించలేదా అన్న సందేహాలు లేకపోలేదు. దీనిపై జనార్దన్ కుటుంబం, బంధువులతో పాటు పార్టీ కేడర్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలపై జనార్దన్ ఆత్మీయులు మదనపడుతున్నట్లు తెలిసింది.
యువగళం వైఫల్యం...
లోకేష్ ప్రవర్తనతో జనార్దన్ అనుచరులు, అభిమానులు, పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఒంగోలు యువగళం పాదయాత్ర వైఫల్యం చెందినట్లేనన్నది స్పష్టమవుతోంది. ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్డులో మొదటి రోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇరుకు సందులో ఏర్పాటు చేసినా, డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తోలినా అనుకున్నంతగా లోకేష్ సదస్సుకు జనం రాకపోవడంతో వెలవెలబోయింది. దీనిపై లోకేష్ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
నాడు మామ..నేడు అల్లుడు...
ఒంగోలు వేదికగా హీరో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ అన్నీ తానై ఏర్పాట్లు చేశారు. వేదిక విషయంలో హైడ్రామా చేశారు. ఫంక్షన్ సందర్భంగా బాలకృష్ణ సమక్షంలో సినిమా డైరెక్టర్ మలినేని గోపీచంద్ ప్రసంగంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత బాలకృష్ణ అయినా జనార్దన్ పేరు ప్రస్తావించలేదు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పుడు కూడా జనార్దన్‌కు భంగపాటు తప్పలేదు. తాజాగా బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ సైతం జనార్దన్ పేరును అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో మరో మారు నిరాశ తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment