
ఏకంగా దేశ అధ్యక్షుడికే వార్నింగ్ ఇచ్చాడు!
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఓ విద్యార్థి షాకిచ్చాడు. ఏకంగా ఆయన అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేయడంతో పాటు కొన్ని డిమాండ్లతో కూడిన వార్నింగ్ ఇవ్వడం అక్కడ కలకలం రేపింది. ఆ విద్యార్థిని లంక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థికి దాదాపు మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 3లక్షలు ఫైన్ విధించనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓ విద్యార్థి జీసీఈ ఆడ్వాన్స్డ్ లెవల్ పరీక్షలు పరీక్షలను వాయిదా వేస్తే బాగుంటుందని భావించాడు. ఇందుకోసం ఏం చేసేందుకైనా వెనకాడకూడదని నిర్ణయించుకున్నాడు.
ఏకంగా అధ్యక్షుడు సిరిసేన అధికారిక వెబ్ సైట్ హోమ్ పేజీని తొలగించి తన డిమాండ్లను ఆ పేజీలో కనిపించేలా చేశాడు. పరీక్షలను ప్రస్తుతం నిర్వహించవద్దని.. వీలైతే పరీక్షలకు వాయిదావేయాలని, లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని తన డిమాండ్లలో పేర్కొన్నాడు. ఇది తెలుసుకున్న అధికారులు, పోలీసులు ట్రాకింగ్ ద్వారా కడుగన్నావాలో ఆ విద్యార్థి ఇంటికెళ్లి అరెస్టుచేశారు. రాజధాని కొలంబో నుంచి ఆ గ్రామం 100కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ లంక ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయని, అయితే తొలిసారిగా ఓ యువకుడిని సైబర్ క్రైమ్ యాక్ట్-2007 కింద అదుపులోకి తీసుకున్నామని వివరించారు. విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.