అమెరికాలో ఉత్కంఠ
- గురువారం సెనెట్ ఇంటలిజెన్స్ కమిటీ ముందుకు జేమ్స్ కోమీ
- సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం
- ప్రత్యక్షప్రసారం చేయనున్న పలు టీవీ చానెల్స్
అమెరికా ‘రాజకీయం’ మలుపు తిరుగుతుందా? అధ్యక్షుడిగా ట్రంప్ అభిశంసనకు బీజం పడుతుందా? ఇప్పుడు అమెరికన్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి. కారణం... ఎఫ్‌బీఐ డైరక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన జేమ్స్ కోమీ గురువారం వాషింగ్టన్‌లో సెనెట్ ఇంటలిజెన్స్ కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ప్రమాణం చేసి సెనెటర్లు అడిగే ప్రశ్నలకు ఆయన బదులిస్తారు. ఆయన నోట ఏ సంచలన వ్యాఖ్యలు బయటికి వస్తాయో, ట్రంప్‌ను ఇరుకున పెట్టే సంగతులేమైనా బయటపెడతారేమోనని ఇప్పుడు అమెరికా అంతా ఎదురుచూస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల సమయంలో కోమీ సెనెట్ కమిటీ ముందుకు వస్తారు.
విషయం ఏమిటంటే: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రష్యా సహకరించిందని, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్, ఇతర డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నాయకుల ఈ మెయిల్స్‌ను లీక్ చేయడం ద్వారా ట్రంప్‌కు సహకరించిందనేది ఆరోపణ. దీనిపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. ట్రంప్ బందం రష్యా రాయబారితో టచ్‌లో ఉందనేది వెల్లడైంది. ట్రంప్ ప్రచార బందంలో కీలకంగా పనిచేసిన మైకేల్ ఫ్లిన్ తర్వాత జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు.
రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్‌తో తాను సంభాషించిన విషయంపై ఉపాధ్యక్షుడు పెన్స్‌ను తప్పుదోవ పట్టించారని తేలడంతో మైకేల్ ఫ్లిన్ నెల తిరగకముందే జాతీయ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన ప్రచార బృందానికి రష్యాతో ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతుండగా... గతనెల 9వ తేదీన ట్రంప్ అకస్మాత్తుగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి కోమీకి ఉద్వాసన పలికారు. విచారణను అడ్డుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. తనకు సన్నిహితుడైన ఫ్లిన్‌పై విచారణను నిలిపివేయాల్సిందిగా కోమీని అధ్యక్షుడి హోదాలో ట్రంప్ కోరినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. వీటిపై సెనెటర్లు గురువారం ప్రశ్నలు సంధించనున్నారు.
ఎదురయ్యే కీలక ప్రశ్నలు:
1. ఫ్లిన్‌పై విచారణలో వెనక్కితగ్గాల్సిందిగా అధ్యక్షుడు మీపై ఒత్తిడి తెచ్చారా?
2. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటే... అందులో ఫ్లిన్ పాత్రేమిటి?
3. ట్రంప్‌ను ఎప్పుడు కలిశారు... ఏం మాట్లాడారు?
4. తనకు విధేయుడిగా పనిచేయాలని అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ మిమ్మల్ని అడిగారా?
5. రష్యా జోక్యంపై విచారణలో ట్రంప్ పాత్రపై విచారణ జరగడం లేదని మీరు ఆయనకు చెప్పారా?
పర్యవసానాలు: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అమెరికా జోక్యం విషయంలో కోమీ మాట్లాడటానికి నిరాకరించొచ్చు. దర్యాప్తును ప్రభావితం చేస్తుందనే కారణం చూపొచ్చు. ఫ్లిన్‌ను కాపాడటానికి ట్రంప్ అధ్యక్ష హోదాలో ఒత్తిడి తెచ్చారని కోమీ వెల్లడిస్తే రాజకీయ దుమారం రేగుతుంది. న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలినందున ట్రంప్‌ను అభిశంసించాలనే డిమాండ్లు పెరుగుతాయి. అయితే న్యాయపరంగా ట్రంప్‌పై అభియోగాలు మోపే అధికారం సెనెట్ కమిటీకి లేదు. రష్యా జోక్యం, ట్రంప్ బృందానికి క్రెమ్లిన్‌తో ఉన్న సంబంధాలపై విచారణకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్‌ను ప్రత్యేక కౌన్సిల్‌గా మే 17న నియమించారు. ఆయన దర్యాప్తులో తేల్చే విషయాలపైనే ట్రంప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
సాక్షి నాలెడ్జ్ సెంటర్