కఠ్మాండులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలలతో సుష్మాస్వరాజ్
కఠ్మాండు: దక్షిణాసియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఉగ్ర భూతాన్ని తరిమికొట్టేందుకు సార్క్ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే దక్షిణాసియా మరింత శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లేందుకు సంస్కతి, వాణిజ్యం, దేశాల మధ్య అనుసంధానం కీలకమన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో మంగళవారం జరిగిన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మ ప్రసంగించారు. అఫ్ఘానిస్థాన్‌లో రెండు రోజుల కిందట వాలీబాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 50 మందికిపైగా హతమార్చడాన్ని ఆమె గుర్తు చేశారు. దక్షిణాసియాకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ అని ఈ ఘటన మరోసారి నిరూపించిందన్నారు.
ఉగ్రవాద సమస్యను అధిగమించేందుకు సభ్య దేశాల మధ్య సమష్టి కృషి అవసరమన్నారు. అలాగే ఆర్థిక వృద్ధిరేటును పెంచేందుకు సభ్య దేశాల మధ్య రోడ్డు, రైల్వే, విమాన సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌లోని తమ ప్రభుత్వం 'అందరితో కలసి, అందరి అభివద్ధి' అనే నినాదంతో ముందుకు వెళ్తోందని చెప్పారు. సార్క్ దేశాల ప్రాంతీయ ఏకీకరణకు కూడా ఇదే తమ దేశ విధానమని సుష్మా అన్నారు.
ఇదిలా ఉండగా, ఈ సమావేశం సందర్భంగా విదేశీ వ్యవహరాలు, జాతీయ భద్రతకు సంబంధించి పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్‌ను సుష్మాస్వరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
**