7.5 టన్నుల ట్రక్కుతో దాడికి కుట్ర!
లండన్ బ్రిడ్జి ముష్కరుల ప్రణాళిక.. ట్రక్కు అద్దె చెల్లింపులో విఫలం
లండన్:
ఇటీవల లండన్ బ్రిడ్జిపై వ్యాన్‌తో, కత్తులతో దాడి చేసి 8 మందిని పొట్టనబెట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదులు వాస్తవానికి భారీ మారణకాండకు తెగబడాలని పథకం వేసినట్లు తెలిసింది. వీరు ఈ నెల 3వ తేదీన 7.5 టన్నుల బరువైన ట్రక్కుతో దాడి చేసి, చాలామందిని చంపాలనుకున్నట్లు బ్రిటన్ మీడియాలో వార్తలొచ్చాయి. ఉగ్రముఠా నాయకుడైన పాక్ సంతతి ముష్కరుడు ఖుర్రమ్ షాజాద్ బట్ 7.5 టన్నుల ట్రక్కును అద్దెకు తీసుకోవడానికి యత్నించాడని, అయితే అతని క్రెడిట్ కార్డు చెల్లింపు విఫలమైందని పోలీసులు తెలిపారు. దీంతో దుండగులు అదే రోజు ఒక వ్యాన్‌ను అద్దెకు తీసుకుని దాడి చేశారన్నారు. ట్రక్కుతో దాడి చేసి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయేవారని వెల్లడించారు. గత ఏడాది ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ప్రజలపై దాడికి ఉగ్రవాదులు వాడిన ట్రక్కులాంటి ట్రక్కునే వీరు వాడాలకున్నారని, నీస్ దాడిని పునరావృతం చేయాలనకున్నారని పేర్కొన్నారు.
దాడికి వాడిన వ్యాన్ వెనుక భాగంలో పెట్రోల్ బాంబులు నకిలీ ఆత్మాహుతి జాకెట్లు తదితరాలు దొరికాయని పోలీసులు తెలిపారు. షాజాద్ భట్ సహా ముగ్గురు ఉగ్రవాదులు లండన్ బ్రడ్జిపై మొదట వ్యాన్‌తో పాదచారులపై దాడిచేసి, తర్వాత కత్తులతో విచక్షణా రహితంగా పొడవడం, తర్వాత పోలీసులు కాల్పుల్లో హతమవడం తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఇల్‌ఫోర్డ్, బార్కింగ్ లండన్ ప్రాంతాల్లో దాడులక కుట్రపన్నినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.