ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి కృష్ణబిలాల ఆధారం
విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి తరంగాలు విడుదలవుతుంటాయని సాపేక్ష సిద్ధాంతంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ప్రతిపాదనకు బలం చేకూర్చే ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాంతితో సహా విశ్వంలోని అన్ని రకాల పదార్థాలనూ హాంఫట్ చేసేసే కృష్ణబిలాలు సాధారణంగా అన్ని గెలాక్సీల కేంద్రాల్లోనూ ఉన్నా.. చాలావరకూ ఒక భారీ కృష్ణబిలం(సూపర్ మ్యాసివ్ బ్లాక్‌హోల్) మాత్రమే ఉంటుందని ఇదివరకూ గుర్తించారు. కానీ.. 400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఓ గెలాక్సీ కేంద్రంలో మూడు భారీ కృష్ణబిలాలు అతిదగ్గరగా పరస్పరం బంధించబడి ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
ఈ కృష్ణబిలాలు మన సూర్యుడి కన్నా.. 10 లక్షల నుంచి 1,000 కోట్ల రె ట్ల ద్రవ్యరాశితో ఉండవచ్చట. వీటిలో రెండు కృష్ణబిలాలు చాలా దగ్గరగా 500 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉండటమే కాకుండా, అవి ఒకదాని చుట్టూ ఒకటి ధ్వనివేగానికి 300 రెట్ల వేగంతో తిరుగుతున్నాయట. అందువల్ల వీటి నుంచి వెలువడుతున్న గురుత్వాకర్షణ శక్తి అలల మాదిరిగా అంతరిక్షంలోకి విడుదలవుతోందట. అలాగే దూరంగా ఉండటం వల్ల మరో బ్లాక్‌హోల్ నుంచి సరళరేఖ మాదిరిగా శక్తి తరంగాలు వెలువడుతున్నాయట. ఐన్‌స్టీన్ ఊహించిన గురుత్వాకర్షణ తరంగాల అన్వేషణకు ఈ కృష్ణబిలాలపై అధ్యయనం బాగా దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.