'OK' కి ఎన్నేళ్లో తెలుసా?
మనం రోజు విరివిగా వాడే పదం 'ఓకే (OK)'. భాషలకు అతీతంగా ఈ చిన్నపదం స్థిరపడిపోయింది. కానీ ఆ చిన్న పదం పుట్టుక వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. 1839 మార్చి 23 న బోస్టన్ మార్నింగ్ పోస్ట్ పత్రికలో అలన్ మెట్ కాఫ్ అనే వ్యక్తి గ్రామర్ గురించి ఓ వ్యంగ్య వ్యాసం రాశారు. అందులో అన్ని కరెక్టు ( ALL CORRECT) అనే పదానికి బదులు (OLL KORRECT) అని రాసి దాన్ని కుదించి OK గా ప్రచురించారు. అయితే స్పెల్లింగ్ ఫన్నీగా ఉండటంతో అది పలువురిని ఆకర్షించింది. వెంటనే మూడు రోజుల తర్వాత అదే పత్రికలో మరోసారి 'OK' ప్రచురితమైంది. అలా ఆ ఏడాది చివరికి 'ఓకే' ప్రజలకు కొంచెం అలవాటైంది.
అయితే, ఓకే కి అసలు సిసలైన ప్రచారం వచ్చింది మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే. 1840 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మార్టిన్ వాన్ బ్యూరెన్ పోటీ పడ్డారు. ఆయనకు ఓల్డ్ కిండర్ హుక్( old kinderhook) అనే నిక్ నేమ్ ఉండేది. ఆయన మద్దతుదారులు ఆ నిక్ నేమ్ ను షార్ట్ కట్ చేసి పలు చోట్ల O.K. క్లబ్స్ ను ఏర్పాటు చేశారు. దాంతో ఆ పదం ఫుల్ గా పాపులర్ అయిపోయింది. అయితే ఈ దశలో ఓకే సృష్టి కర్త మెట్ కాఫ్ ..OK కి రెండు అర్థాలున్నాయని, ' ఓల్డ్ కిండర్ హుక్ వజ్ ఆల్ కరెక్ట్' అంటూ బోస్టన్ మార్నింగ్ పోస్ట్ లో రాసిన ఓ వ్యాసంలో ప్రస్తావించారు. ఇలా ఓకే కు ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో బ్యూరెన్ ప్రత్యర్థి అయిన విలియం హెన్నీ హారిసన్ సపోర్టర్స్ కూడా ఓకే ను వాడటం మొదలు పెట్టారు. అయితే బ్యూరెన్ ను ఇరుకన పెట్టే విధంగా వారు దానిని ఉపయోగించుకున్నారు.
బ్యూరెన్ కు ముందు అధ్యక్షుడిగా ఉన్న ఆండ్రూ జాక్సన్ కు అసలు స్పెల్లింగ్స్ రావని, ఆయన ఆమోదించాల్సిన ఫైల్స్ పై ' ALL CORRECT' బదులు 'OLE KORRECK' ను కుదించి O.K. అని రాసేవారని ప్రచారం చేశారు. అది విపరీతంగా జనాల్లోకి వెళ్లిపోయి..చివరకు ఆ ఎన్నికల్లో విలియం హెన్రీ నే విజయం వరించింది. అలా ఓకే అనే రెండు అక్షరాలతో హెన్రీ తన గెలుపును OK చేసుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో భాషలకు అతీతంగా OK బాగా స్థిరపడిపోయింది. అయితే, ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. 1830 నాటికి వాడుకలో ఉన్న 'ఓర్ల్ కరెక్ట్' అనే పదం నుంచి 'ఓకే' ఆవిర్భవించి ఉంటుందని చెబుతోంది.
కానీ సోషల్ మీడియా షార్ట్ కట్ చాటింగ్ ప్రపంచంలో ఇప్పుడేమో మనం OK ని మరింత చిన్నగా చేసి K గా మార్చేస్తున్నాం. ఏదైతేనేం OK పుట్టి ఇప్పటికి 177 సంవత్సరాలై మనందరికి చేరువైంది.