రోజుకు ముగ్గురు కస్టమర్లు వస్తారు.. అమినత తలదించుకుని చెప్పింది. ఆమె వయసు 15. ఈ వయసులో వేశ్యగా మారిందంటే కారణం.. ఆకలి. అవును.. చదువుకోవాలనే ఆకలి.. చదువుకుని జీవితంలో ఎదగాలనే ఆకలి.సియెరా లియోన్.. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి. అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న దేశం. నిరుపేద కుటుంబాల పిల్లలు చదువుకోవడమంటే అదిక్కడ లగ్జరీ కిందే లెక్క. అదీ ఆడపిల్లలంటే మరింత చిన్నచూపు. ఏడాది చదువుకు రూ.4 వేలు. దీంతో ఇక్కడ ఇలాంటి అమినతలు ఎందరో కనిపిస్తారు. చదువుకు ప్రతిగా తమ దేహాన్ని అమ్ముకుంటూ.. ఏదో ఒకరోజు తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతో జీవించేస్తూ..
అమినత లాంటిదే మేరీ కూడా. మేరీ క్లాస్‌లో టాపర్. చదువంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్లు చదివించలేమన్నారు. ఓ వ్యక్తి తనతో గడిపితే చదువుకయ్యే డబ్బులిస్తానన్నాడు. తన ముందు మరో మార్గం లేదు. కొన్నాళ్లు బాగానే నడిచింది. మేరీ గర్భవతి అయ్యాక అతడి అసలు రంగు బయటపడింది. వదిలి వెళ్లిపోయాడు. చదువు ఆగిపోయింది. లాయర్ కావాలన్న ఆమె కల కలగానే మిగిలిపోయింది.సియెరా లియోన్‌లో నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ‘మెయిల్ ఆన్‌లైన్’ (బ్రిటన్‌లోని డెయిలీ మెయిల్ టాబ్లాయిడ్ తాలూకు ఆన్‌లైన్ వెబ్‌సైట్) చేపట్టిన స్ట్రీట్ చిల్డ్రన్ కార్యక్రమంలో పలువురిని కదిలించినప్పుడు ఇలాంటి గాథలెన్నో వినిపించాయి. ఇంట్లో వాళ్లు చదివించక.. కుటుంబం మద్దతు కోల్పోయి.. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రిళ్లు వేశ్యగా.. ఉదయం విద్యార్థినిగా మారుతున్న ఎన్నో ఉదంతాలు వారిని కదిలించాయి. కొందరు వేశ్యలుగా మారుతుంటే, మరికొందరు.. చదివిస్తామంటూ కొందరు మగాళ్లు చెబుతున్న మోసపూరిత మాటలను నమ్మి.. వారి కామదాహానికి బలైపోతున్నారు. వీరి విషయంలో కొన్నాళ్లు బాగానే నడుస్తున్నా.. గర్భవతులయ్యేసరికి పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. గర్భం దాల్చడంతో వీరి చదువుకు ఫుల్‌స్టాప్ పడిపోతోంది.
ఇంకో విషయం..
అమినత ఇప్పుడు గర్భవతి. దీని వల్ల ఆమె స్కూల్‌కు కూడా వెళ్లడం లేదు. అయితే, త్వరలోనే స్కూలుకు తప్పకుండా వెళ్తానని అమినత చెబుతోంది. ఎందుకంటే అమినత మరో మేరీ కాదు. అమినత చావనైనా చస్తుంది.. కానీ చదువుతుంది..