ఎగిరే కార్ల ధర ఎంతో తెలుసా?
లండన్ :
హెలీకాప్టర్, విమానాల్లో కాకుండా కార్లలోనే ఆకాశంలోకి ఎంచక్కా ఎగిరేయోచ్చు. హెలీప్యాడ్, ఎయిర్పోర్టుల అవసరం లేకుండానే కార్లలో కూర్చోనే ఆకాశంలో విహరించొచ్చు. .ట్రాఫిక్ జాముల్లో గంటలకొద్ది ఎదురు చూడాల్సిన పని లేకుండా ఆకాశంలోంచే కార్లలో ఎంచక్కా గమ్యస్థానాలకు చేరుకోవొచ్చు. అవునండీ మీరు విన్నది నిజమే. ఈ కల త్వరలో సాకారం కాబోతుంది. డచ్ కంపెనీ పాల్-V గాల్లో చక్కర్లు కొట్టే కారు లిబర్టీని రూపొందించింది. కారు, హెలీకాప్టర్లను పోలి ఉండే ఎగిరే కారు లిబర్టీని 2018లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తొలుత యూకే మార్కెట్లలో ఈ వాణిజ్య కార్లను విడుదల చేయనున్నారు. ఎయిర్, రోడ్డు నిబంధనలకు అనుగుణంగా లిబర్టీని తయారు చేస్తున్నామని పాల్-V తెలిపింది. లిబర్టీ ఓ గైరో ప్లేన్...చూడ్డానికి హెలీకాప్టర్కు ఉన్నట్టుగానే దీనికి పైభాగంలో బ్లేడ్లు ఉంటాయి. 100 హార్స్ పవర్ ఉండే రెండు ఇంజిన్లను ఈ లిబర్టీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అత్యవసర సమయాల్లో వినియోగించడానికి మరో ఇంజిన్ కూడా ఇందులో ఉంటుంది. గాల్లో లిబర్టీ 177 కిలో/గంట వేగంతో విహరించగలదు. అదే రోడ్డు పైన గరిష్ఠంగా 160 కిలో/గంట వేగంతో దూసుకు పోగలదు. డ్రైవింగ్ మోడ్ నుంచి ఫ్లైయింగ్ మోడ్లోకి మారడానికి పదినిమిషాల సమయం తీసుకుంటుంది.
ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 500 కిలో మీటర్లు ప్రయాణించగలదు. ఇందులో పైలెట్తో పాటూ మరో వ్యక్తి మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. అయితే త్వరలోనే కొత్త టెక్నాలజీతో కుటుంబసభ్యులు అందరూ కలిసి ప్రయాణించేలా మరో మోడల్ను కూడా రూపొందించే యోచనలో సంస్థ ఉంది. పర్వతాలు, నదులు, సరస్సులు, ట్రాఫిక్ జామ్లను దాటుకుంటూ లిబర్టీలో చక్కర్లు కొడుతుంటే ఓ కొత్త అనుభూతి కలుగుతుందని పాల్-V యాజమాన్యం తెలిపింది.
ఈ వాహనంలో చక్కర్లు కొట్టాలంటే మాత్రం ముందస్తుగా శిక్షణ తీసుకోవాల్సిందే. రోడ్డు, గాల్లో ఈ వాహనాన్ని నడపాలంటే ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ ఉండాలి. లిబర్టీ తొలి మోడల్ ధర దాదాపు రూ. 3.8 కోట్లుగా నిర్ణయించారు.