
20 ఏళ్ల నుంచి మాటల్లేవ్..!
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజమే.. అలిగితే ఒకటి రెండు రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు. జపాన్‌కు చెందిన ఓ భర్త మాత్రం ఏకంగా 20 సంవత్సరాలు భార్యతో మాట్లాడకుండా ఉన్నాడు.. ఇంతకీ కారణమేంటో తెలుసా.. తనపై ప్రేమ చూపించట్లేదని అలిగాడు..! జపాన్‌లోని నర ప్రాంతానికి చెందిన ఒటోవ్ కటయమ, యుమీలకు 23 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో యూమీ బిజీ అయిపోయింది. దీంతో తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఒటోవ్ ఆమెతో మాట్లాడటం మానేశాడు.
అయితే తన భర్తకు ఎంత దగ్గర కావాలని చూసినా ఒటోవ్ మాత్రం తన పంతం వీడలేదు. ఈ 20 ఏళ్లుగా భార్య చెప్పిన మాటలకు సైగల ద్వారానే సమాధానం ఇచ్చేవాడు. దీంతో వారి కుమారుడు యోషికీ (18) వీరిని ఎలాగైనా కలపాలని నిశ్చయించుకుని ఓ టీవీ షోకు వెళ్లాడు. ఆ టీవీ షో నిర్వాహకులు ఒటోవ్, యూమీలు ఓ పార్కులో కలుసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఏర్పాటు చేశారు. ‘నువ్వు పిల్లలపై చూపే అపారమైన ప్రేమ నాలో అసూయ కలిగించింది. ఇప్పటి వరకు మాట్లాడనందుకు క్షమాపణలు కోరుకుంటున్నా’అని ఎట్టకేలకు యుమీతో ఒటోవ్ చెప్పాడు. దీంతో వారి పిల్లల ఆనందానికి అవధులు లేవు.