
పదేళ్లలో గ్రహాంతర వాసుల ఉనికి..
న్యూయార్క్: భూమికి సరిగ్గా 40 కాంతి సంవత్సరాల దూరంలో ‘ట్రాపిస్ట్-1’ నక్షత్రం చుట్టూ భూమి పరిణామంలో మూడు గ్రహాలు తిరుగుతున్న విషయాన్ని అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల బృందం మే రెండవ తేదీన కనిపెట్టిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ మూడు గ్రహాల్లో జీవి ఉందా, లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వారు కృషి చేస్తున్నారు. భూమిని పోలిన, అంటే జీవి బతికేందుకు అవకాశమున్న వాతావరణ పరిస్థితులు ఆ మూడు గ్రహాల్లో ఉన్నాయో, లేదో కనుగొనేందుకు ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుందని, ఆ వాతావరణంలో కచ్చితంగా జీవి ఉందా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు పది నుంచి పాతికేళ్లు పడుతుందని వారు చెబుతున్నారు.
విశ్వాంతరాళంలో భూమిని పోలిన గ్రహాలు అనేకం ఉన్నాయనే విషయాన్ని ఎప్పటి నుంచో అంచనా వేసిన ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులను కనుగొనేందుకు ఎప్పటి నుంచో వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తున్న విషయం తెల్సిందే. అందులో రకరకాల మార్గాల్తో శాస్త్రవేత్తలు సంకేతాలు పంపిస్తున్న విషయం కూడా అవగతమే. సౌర కుటుంబం వాతావరణంలోకి ఎగిరే పళ్లాల లాంటి ఆకారాలు వచ్చినప్పుడల్లా అవి గ్రహాంతరవాసుల వాహనాలు కావచ్చుంటూ వాటికి సంకేతాలు పంపించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మన సౌర కుటుంబానికి వెలుపల భూమిని పోలిన గ్రహాలు మూడు ఉన్న విషయాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొనడంతో ఆ గ్రహాలపై జీవి ఉనికిని కనిపెట్టడం కోసం వారు దృష్టిని కేంద్రీకరించారు. ఈ మూడు గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే భూమి లాంటి వాతావరణం కలిగి ఉండే అవకాశం ఉందని వారు అంటున్నారు. నాసా టెలిస్కోప్ ద్వారా తాము ఈ నిర్ణయానికి వచ్చామని వారు చెప్పారు.
2018 నాటికి ‘జేమ్స్ వెబ్ స్పేస్’ టెలిస్కోప్ అందుబాటులోకి వస్తుందని, అప్పుడు దాని ద్వారా భూమిని పోలిన గ్రహాల వాతావరణంలో గ్యాస్ ఉందా, లేదా ? అన్న అంశాన్ని స్పష్టంగా చూడవచ్చని, జీవి ఉన్నప్పుడు వాతావరణంలో గ్యాస్ నిక్షేపాలు కనిపిస్తాయని ‘నేచర్’ జర్నల్‌లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల తరఫున వ్యాసం రాసిన ప్రొఫెసర్ మైఖేల్ గిలాన్ తెలిపారు. గ్యాస్‌తోపాటు నీటి నిక్షేపాలు ఉంటే జీవి బతికే అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. నక్షత్రం వైపున్న ఈ భూమిని పోలిన గ్రహాల ముందు భాగంలో ఎక్కువ వేడి ఉండే అవకాశం ఉందని, వెనకభాగం పూర్తి చీకటిగా ఉండే అవకాశం ఉందని, ఈ రెండు ప్రాంతాల్లో జీవి ఉండే అవకాశం లేదని, ఇరుపక్కల ప్రాంతాలు మాత్రం కొంచెం శీతలంగా ఉన్నాయని, ఆ ప్రాంతంలో జీవి ఉండే ఆస్కారం ఉందని ఆయన చెప్పారు.