ఇలాంటి బర్త్ డే ఎక్కడా చూడలేరేమో.. !
వాషింగ్టన్: ఒక వ్యక్తి వందో పుట్టిన రోజు జరుపుకోవడమంటేనే ఈ రోజుల్లో ఆశ్చర్యకరమైన విషయం. అలాంటిది ముగ్గురు స్నేహితులు కలిసి వందో పుట్టిన రోజు జరుపుకునే సందర్భం వస్తే ఎలా ఉంటుంది? అమెరికాలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఒక స్నేహితుడుగానీ, స్నేహితురాలుగానీ కలిసి పుట్టిన రోజు జరుపుకునే సందర్భాలు కేవలం వేళ్లపై లెక్కబెట్టుకునేన్ని మాత్రమే ఉండే ఈ రోజుల్లో ఏకంగా ఓ ముగ్గురు స్నేహితురాళ్లు పుట్టిన రోజుకు హాజరుకావడమే కాకుండా ఏకంగా వందో పుట్టిన రోజు కలిసి ముందస్తుగా జరుపుకున్నారు. ఈ ముగ్గురికి కూడా అక్కడి మేయర్ ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు.
వాషింగ్టన్ లో 1916 జూలై నెలలో బార్నెస్, బట్లర్, అండర్ వుడ్, రూత్ హామెట్ అనే నలుగురు జన్మించారు. వీరు చిన్నప్పటి నుంచే మంచి స్నేహితురాళ్లు. సంసారాల్లో వేర్వేరు జీవితాలతో బిజీగా ఉన్న పండుగలు, పబ్బాలకే కాకుండా తమ పుట్టిన రోజుకు తప్పనిసరిగా కలుస్తుంటారు. వాషింగ్టన్ లోని జియాన్ బాప్టిస్ట్ చర్చిలో తమ పుట్టిన రోజు జరుపుకుంటారు.
మరికొద్ది రోజుల్లో వారికి వందేళ్లలోకి అడుగుపెడతారు. అయితే, ఈ నలుగురిలో బార్నెస్ అనే తమ స్నేహితురాలు చనిపోగా మిగిలి ఉన్న ఆ ముగ్గురు స్నేహితురాళ్లు అదే చర్చిలో వందో పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. ఎంతో సంబురంగా జరిగిన వేడుకలో తమ కుటుంబాల సంతానమే ఒక పెద్ద సమూహంగా దర్శనమిచ్చింది. ఈ సందర్బంగా ఒక్కొకరు ఒక అరగంట మాట్లాడి తమ స్మృతులు నెమరు వేసుకున్నారు.