
సాధారణంగా కొరియర్‌లో మనం ఏమేం పంపిస్తుంటాం.. పుస్తకాలో, ఫోన్లో, ఇతరత్రా వస్తువులో.. కానీ మెక్సికోలో మాత్రం స్మగ్లర్లు పులిపిల్లను కొరియర్ చేశారు. దానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. పులి పిల్లను పంపిన ప్లాస్టిక్ డబ్బాలో మెత్తదనం కోసం పేపర్లు నింపి ఊపిరాడేందుకు డబ్బాకు రంధ్రాలు పెట్టారు. మెక్సికో పశ్చిమ రాష్ట్రం జాలిస్కో నుంచి మధ్య రాష్ట్రం క్వెరెటారోకు ఈ కొరియర్‌ను ఆర్డర్ చేశారు.
ఇంత జాగ్రత్త పడినా దొరికిపోయారు. ఎలాగంటారా.. జాలిస్కోలోని ట్లాక్వుపాగ్యు నగరలో బస్ స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్నపుడు ఓ ప్లాస్టిక్ కంటెయినర్‌లో శబ్దం, కదలికలు, వాసనను గుర్తించాయి పోలీసు జాగిలాలు. అందులో ఏముందో అని తనిఖీ చేసిన అధికారులకు రెండు నెలల బెంగాల్ టైగర్ కనిపించింది. డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న పులి పిల్లను చూసిన అధికారులు తొలుత కంగారుపడినా.. వెంటనే తేరుకొని జంతుసంరక్షణ అధికారులకు అప్పగించారు. దీన్ని బట్టి కొరియర్‌కు కాదేదీ అనర్హం అనాలేమో..
Comments
Please login to add a commentAdd a comment