అనంతపురం ఎడ్యుకేషన్: కొరియర్‌లో ల్యాప్‌టాప్ వచ్చిందనుకుంటే బండరాయి కనిపించిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల సమగ్ర శిక్ష డీపీసీ, ఏపీసీలకు హెచ్‌పీ కంపెనీ 12 జనరేషన్, 16 జీబీ ర్యామ్, 1టీబీ ఎస్‌ఎస్‌డీ, స్క్రీన్ విండోస్ 11 ప్రో, ఎంఎస్ ఆఫీస్ అడాప్టర్ క్యారీ కేస్ సామర్థ్యం కల్గిన ల్యాప్‌టాప్స్ కొనుగోలు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన కంప్యూటర్ ఇండియా అనే సంస్థ ఈ ల్యాప్‌టాప్స్‌ను సరఫరా చేసింది. మే 31న జిల్లాకు వచ్చాయి. డీపీసీగా ఉన్న డీఈఓ తనకు అందిన ప్యాకింగ్ ఓపెన్ చేయగా, ల్యాప్‌టాప్ ఉంది. ఈ క్రమంలోనే జిల్లాకు పంపిన రెండు ల్యాప్‌టాప్‌ల్లో ఒకదానిని అందుకున్నట్లు సమాచారం పంపారని, రెండో దాని వివరాలు పంపాలంటూ బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సమగ్ర శిక్ష ఏపీసీకి వచ్చిన పార్శిల్‌ను ఓపెన్ చేయగా.. అందులో బండరాయి దర్శనం ఇచ్చింది.
ఆ రాయికే కవర్లు కప్పి ఉంది. అందులోనూ దాదాపు ల్యాప్‌టాప్ బరువు ఏ మేర ఉంటుందో అంతేస్థాయి బరువున్న రాయి ఉంచారు. అయితే, ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర కార్యాలయ అధికారుల దృష్టికి స్థానిక సిబ్బంది తీసుకెళ్లారు. ల్యాప్‌టాప్ పార్శిల్ కవరుపై ఉన్న కంప్యూటర్ ఇండియా సంస్థ ఫోన్ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment